Wednesday, May 11, 2016

నాకక్కర్లేదు


మాట్లాడని అక్షరాలు నాకక్కరలేదు
మరణించిన మనసులు అసలక్కర్లేదు
.
ముట్టుకున్నా వాసన తెలియని ఎరుపురంగులు
ఎంత ఎత్తున వున్నా విలువతెలియని రెపరెపలు
వెలిగించినా వెలుగునివ్వని వ్యవస్థలు
బయటకొచ్చి ప్రపంచాన్ని చూడలేని బెక బెకలు
నాకక్కర్లేదు
.
కళ్ళున్నా చూడడానికి ఇష్టపడని చూపులు
బ్రతికున్నా ఇంకొకరి బ్రతుకుకోరలేని జీవితాలు
చలనం లేక చంచలత్వం వచ్చిన రాతి శాసనాలు
కంచర గాడిదలకు కాపలా కాసే యునిఫారంలు
నాకక్కర్లేదు
.
నేనేంటో.. నాకు నేనేంటో ..
నా వరకే పరిమితమయ్యే ఈ సిద్దాంతాలేంటో
ఏదో రోజు నీ వరకు రావా ..
అప్పుడు కూడా నువ్విదే అంటావ్
"నాకక్కర్లేదు " అని
@Lakshmi

Tuesday, May 10, 2016

Just for Fun

అర్దరాత్రి ఆకలయి మెలకువ వచ్చింది
అనిపించిందే తడవుగా మహాబార్ బుక్ లోని వైట్ పేపర్ తీసా
నా ఇంటర్ లో మా ఫిబీ మేడం చెప్పిన
నాలుగు మంచిమాటలు పేపర్ పై రాసుకున్నా
కొంచెం స్పైసిగా వుండాలని
రెండు శ్రీ శ్రీ గారి లైన్లను దానికి కలిపా
మళ్లీ ఉప్పు తక్కువ అవుతదేమో అని
మా NSR గారి లైన్లు ఒక అయిదు కలిపా
పేపర్ ఫుల్ అయ్యింది
ఇంక తిందాం అని మడత పెట్టా
ఇంతలో మసాలా తక్కువ అవుతుందేమో
అని అనుమానం వచ్చి
నాకు ఇంగ్లీష్ నేర్పిన కమలిని ముఖర్జీ
అనగా మా B Tech ఇంగ్లీష్ లెక్చరర్ ...
ఆవిడ పలికిన నాలుగ ఇంగ్లీష్ పదాలు వేసా ..
వహ్... సూపర్ ..
తినబోతుండగా .....మధ్యలో
మా కెమిస్ట్రీ మాస్టర్ RK గారు చెప్పిన విషయం గుర్తొచ్చింది
" చదవని రోజున తినే హక్కు లేదని "
వెంటనే పేస్బుక్ ఓపెన్ చేసి రెండు పోస్ట్ లు చదివేసి
గబా గబా తినేసి పడుకున్నా
.
@Lakshmi

ఇది అది కాదు

నగ్నంగా కనిపించే నిజాన్ని చూడలేక
మీ సిద్ధాంతాల రంగుల బట్టల్ని కప్పి
మీ చూపుతో మీ మనసుకి మీరే అసత్యాన్ని చూపి
ఆ తప్పుని సమాజానికి ఆపాదిస్తూ
మీ కవి రాతల్నినిజమని నమ్మే
భవిష్యత్తుకు
నిజాన్ని వేశ్యగా చూపి
అబద్దాన్ని అమ్మలా చూపించండి
.
మీ బాటలో నడిచిన వాళ్ళు
నిజం తెలిసిన నాడు
మీరు అందంగా అలంకరించిన స్మశానంలో
మీ బంగారు సమాధుల్ని కడతారు
@Lakshmi

( మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )'

నేను నమ్మను
మీరు ఎన్ని చెప్పినా
ఎన్ని సార్లు చెప్పినా
ఎంత గింజుకుని చెప్పినా
నేను నమ్మను

ఈ ఒక్క రోజు
మీరు చూపించే గౌరవం చూసి
364 రోజులు చేస్తున్న
దౌర్జన్యాలను మరచి
పళ్ళికిలించడం నా వల్ల కాదు
.
సిద్దాంతాలను పేపర్లలో చూపి
చేతల్లో
మీ చెత్త బుద్దిని చూపిస్తున్న సాక్ష్యాలను
చూస్తూకూడా చూడనట్టుగా ఉంటూ
మీ మేకప్ బ్రతుకులకు
పౌడర్లు అద్దడం నాకు రాదు.
.
మీ మాటలకు చేతలకు
చప్పట్లు కొట్టే చింతామణులు
చెరువు గట్ల దగ్గర చేరి వుంటారు
వెళ్లి అక్కడ చెప్పుకోండి
మీ హృదయ పూర్వక
ఆరాధనలు , అభ్యుదయ భావాలు .
.
ఇక్కడొచ్చి
మీరెంత అరిచి గోల పెట్టినా
మీ ఉత్తుత్తి గౌరవాలను
నేను గౌరవించను
@Lakshmi

ఎవడు?

ఎవడు తిన్నాడు పచ్చడి మెతుకులు ?
ఎవడు తాగాడు ఇక్కడ గంజి ?
ఎవడిక్కడ వివక్షకు గురయింది ?
ఎవడి తరపున నిలబడి ఎవరిని ఎదిరిస్తున్నావ్ ?
ఎవరిపై కోపాన్ని ఎవరికి చూపిస్తున్నావ్ ?
ఎవరిని బలిచేసి ఎవరి ఆకలి తీర్చాలనుకుంటున్నావ్ ?
చివరికి ఎవరికి గర్భశోకం మిగులుతుంది ?
ఈ ప్రశ్నలకు తిరిగి ప్రశ్నలే వస్తాయి జవాబుగా ...
.
ప్రశ్నకు అసలైన జవాబు దొరకిన నాడు
పేదోడికి పెద్దోడికి మధ్య
మధ్యవర్తిలా వ్యవహరిస్తూ
పుల్లా పుల్లా చేర్చి
ఇన్నాళ్ళు మామద్యన మంటపెట్టిన
ముండా కొ__ కుల అస్థిపంజరాలతో
మేమందరం చలి కాసుకుంటాం
@Lakshmi

Monday, May 2, 2016

ఎగురుతున్న ఎరుపు రంగు ఇది

ఏముంది ఆ ఇజంలో
పుడమి తల్లికి కడుపు కోత తప్ప
ఎరుపు రంగు ఏరులై పారడం తప్ప
.
నిజాన్ని మరచి ...
ఇజం ఇజం అంటూ గుండెలు బాదుకొంటూ
ఎరుపురంగు జాడలు విడుస్తున్న లేలేత అడుగులు
ఏ గమ్యాన్ని చేరాలనుకుంటున్నాయి
నీలో నువ్వు బ్రతికుంటే దాన్ని అడుగు
నీ గమనం , గమ్యం రెండూ ఒకవైపేనా అని ...
.
నిన్ను నువ్వు కాపాడుకోడానికి
ఈ ఎరుపుకండువాని ఎంచుకున్నట్టయితే
నీకు తెలియకుండానే అది నిన్ను కాల్చివేస్తుంది
నిఖార్సయిన మనుషుల నెత్తుటితో వెలిగిన సమిధ అది.
.
ఇంటికి ఎరుపురంగేసినంత మాత్రానా
నీ కళ్ళలో ఆ ఎరుపు కనపడదు
ఆకలి అన్నోడి గొంతు నులిమి
వాడి మాంసాన్ని పెంపుడు కుక్కలకు పెట్టె _ కొడుకుల
గుమ్మాలకు కాపలాగా మారిన
నీ నాయకత్వంతో విసుగెత్తిన ఈ చెమట చుక్కలు
ఏదో ఒకనాడు
తమ గుండెమంటలు చల్లార్చుకోడానికి
కల్తీ కలిసిన నీ నేత్తురిని వాడతాయి

@Lakshmi