Tuesday, February 28, 2017

మట్టి విలువ

ఎక్కడో ప్రపంచం ఉందని కాళ్ళ కింద భూమిని కాజేసే నీకేం తెలుసు మట్టి విలువ
కన్న వాళ్ళ భుజాలను మెట్లుగా మార్చుకుని పైకెక్కే నీకేం తెలుసు మట్టి విలువ
ముప్పూటలా తిని ఏసీ లో ఎంగిలి ఆవిర్ల మధ్య మగ్గే నీకేం తెలుసు మట్టి విలువ 
అక్కడెక్కడో కనపడని ఆకాశమార్గాల కోసం అన్వేషిస్తూ
అయినవాళ్లకు ఆనవాళ్లు చూపకుండా తిరుగుతూ
పండక్కి పబ్బానికి సెలవులకోసం ఏడ్చుకుంటూ వచ్చే నీకేం తెలుసు మట్టి విలువ
.
మట్టిని మాగాణి చేసి మెతుకుకోసం మహాయజ్ఞం చేసేవాడినడుగు
నీ బాటా చెప్పులకంటే వాడి బురద కాళ్ళ అడుగు జాడలు ఎంత బలమైనవో
నీ బెంజ్ కారు కంటే వడ్లు మోసుకొచ్చే వాడి ఎద్దుల బండ్లు ఎంత విలువైనవో
ఎక్కలేక దిగలేక లిఫ్ట్ ఎక్కే నీ మోకాళ్ళనడుగు వాడి వెన్నుపూస ఎంత గట్టిదో
.
ప్రపంచం ఎక్కడో లేదు...
వెతుక్కుంటే
ఇంటిముందు గంటల శబ్దం చేస్తూ నీకంటే ముందే లేచే లేగ దూడ అల్లరిలో ఉంటుంది
ఊరి చివర మంచి నీళ్ల బావి దగ్గర నీళ్లు తోడే నీ మేనత్త కూతురి వోణిలో ఉంటుంది
పొలం గట్ల పై నాటిన జొన్న దుప్పుల మధ్యలోచిన్నగా వీస్తున్న పైరగాలి లో ఉంటుంది
మిరపదోట  మధ్యలో నాటిన ముద్దబంతి పూవు నవ్వులో దాగి ఉంటుంది
అప్పుడప్పుడు వచ్చిపోయే చిరుజల్లులో
ఆగకుండా పారే సెలయేరుల్లో
మనసారా పలకరించే మనవాళ్ళ పిలుపుల్లో
మొక్కజొన్న తోట ఊసుల్లో
ఆ పంట పొలాల్లో ఎక్కడ వెతికినా కనిపిస్తుంది
@Lakshmi

Friday, January 27, 2017

అక్షరాల అర్ధాకలి

++++++++++++++
సంతోషాన్ని వెతికే ధైర్యం లేనపుడు
బాధను మోసే బాధ్యత తీసుకోవాల్సిందే
బలం బలగం బేరీజు వేయలేనపుడు బలి కావాల్సిందే
మార్పు నోచుకోని సమాజంలో
మనిషికి మరణంతోనే మనఃశాంతి.
.
మనసుకి మమతా తెలుసు, మరపు తెలుసు
మమత కు బానిస అయినంత కాలం
మనసు బాధకు బందీ కావాల్సిందే
బందీలకు బలం రావాలంటే బంధుత్వపు రుచులు మరవాలి
.
ఆనాడు నేలను తాకిన ప్రతి కన్నీటి బొట్టుకూ
ఈనాడు లెక్క కట్టి ఋణం తీర్చెయ్యాలి
వరదలై పారిన కన్నీళ్ల ఆనవాళ్లలో 
అడుగులు వేస్తూ కదిలిన కాలానికి  ...
నేడు కాలం చెల్లాలి
చిల్లర బ్రతుకుల దొంతరలు తగలెట్టి
తలకొక్క కొత్త కాగడా వెలిగించాలి.
అసుర దహన కాంతికి
కదనరంగం మరో తూరుపులా కనిపించాలి
@Lakshmi

మళ్ళీ ఆ అలల కలలే

+++++++++++++++++
మళ్ళీ ఆ అలల కలలే
ఆ అలలే కలలై గుర్తొస్తున్నాయి.
ఆ అలలే అక్షరాలై జ్ఞాపకాలని తొలుస్తున్నాయి
ఆ అలలే కనులై గతాన్ని తొంగి చూస్తున్నాయి
ఆ అలలే ముళ్ళై రేపటి దారుల్ని కప్పేస్తున్నాయి
ఆ అలలే కాలాన్ని గుప్పిట్లో బందించి, మనసుకి మరపుని దూరం చేశాయి
ఆ అలలే నిన్నటి కన్నీళ్లను తెచ్చి ఈరోజు గుప్పిట్లో పోశాయి
ఆ అలలే ఆవేదని ఆక్రోశాన్ని మోసుకొచ్చి ముంగిట నిలిపాయి 
ఆ అలలే ఇప్పుడు నాలో చేరి మునుపటికి నెట్టివేయాలనుకుంటున్నాయ్
కానీ
ఆ అలలే నిన్నటి నిజాన్ని చూపించబోతున్నాయ్
ఆ అలలే రేపటి దారికి సింధూరాన్ని అద్దాలనుకుంటూ ఎగసిపడుతున్నాయి
ఆ అలలే నాలోని చీకటి ప్రపంచానికి చుక్కలదారిని కనిపెడుతున్నాయ్
ఆ అలలే నాకు నాలోని నన్ను చూపించబోతున్నాయ్ .
@Lakshmi

Wednesday, January 25, 2017

అలల తాలూకు అక్షరాలు


ఏమీ తీసుకోనంటూనే
జ్ఞాపకాల బరువుని తీసేసుకుంది
పలకరించనంటూనే పరిచయాన్ని పెంచుకుంది 
భయపెడుతూనే అక్కున చేర్చుకొని సంతోషాన్ని పంచింది
పీడకలలా మెలకువ తెచ్చి మధ్య రాత్రి వెన్నెలను చూపింది
వెన్నెల రాత్రి రాగాలను బంధించి గుప్పెట్లో పెట్టింది
రంగు వెలిసిన మల్లెలకు వాసనను అద్దింది
చీకటికి రంగులేసిన రాయుడిని రాత్రికి రాజుని చేసి
నన్ను రాణిగా రమ్మని పిలిచింది
కలగా దాచుకున్న క్షణాలను
క్షణంలో అనుభవాలుగా మార్చి సారెగా పెట్టింది
మళ్ళీ రమ్మంటూ మనసునిండా తన జ్ఞాపకాలను నింపింది
ఎరుపెక్కిన తూరుపుని
కుంకుమ బొట్టుగా దిద్ది
ఇంటి ఆడబిడ్డగా సాగనంపింది.
@Lakshmi

Monday, January 23, 2017

సముద్రపు కన్నీళ్లు

++++++++++++++
కళ్ళకు తెలియని చూపులు
వేళ్ళకు తెలియని రాతలు 
పెదవికి తెలియని పిలుపులు
పుట్టుకేలేని ప్రేమకి విరహదాహాలు
ఎదురుకాని మనిషికోసం
ఏళ్లతరబడి ఎదురుచూపులు
కన్నీళ్లు లేవు కలహాలు లేవు ..
చివరికి కౌగిలింతలూ లేవు 
ప్రణయపు ప్రయాణాలకు
పలకరింపులే గాని గమ్యాలు లేవు
.
ఊరి పొలిమేర్లవరకు వెళ్లొచ్చే చూపులు
ఎన్ని వేల సార్లు ఓడిపోయాయో 
ఈ తొలిచూపుకు నోచుకోని ఎదురుచూపులకు
ఏ పైరగాలి ప్రశ్న జవాబుగా మారుతుందో
ఏ అలలో చిక్కిన కల నిజమవుతుందో...
.
ఇన్నాళ్లు కనపడని కన్నీళ్ల ఆనవాళ్లు
నిన్న నన్ను తడిపి ఏడ్చేసాయి
ఓదార్పు ఇవ్వలేని నేను
నేనే సంద్రాన్నై ఆ కలల అలలను మింగేసాను
@Lakshmi