Thursday, June 30, 2016

ఈ జన్మకు .. ఇలా


+++++++++++
విరుల వానలో కురుల అందాలు
గంధపు చీరకు గులాబీ రేకులు
చీరంచున ఆడే సిరి మువ్వల రాగాలు
జతగాడి జాడకై పరుగిడిన పాదాలు
తమకాన్ని తమలోనే తమాయించుకున్న తడబాట్లు
కాలాల కౌగిట్లో కరిగిపోతున్న ఎడబాట్లు
వెన్నెల రాత్రుల్లో వసంత గీతాలు
మౌన పోరాటాల్లో మనసు ఆరాటాలు ..
కలల మాటున కలవరపాట్లు
మల్లెల మాటున మత్తెక్కిన సయ్యాటలు
ఈ జన్మకు ఇలానే ..
.
రేకుల అంచున వెన్నెల గీతికలు
తీగలనెక్కిన పూబాలల కిలకిలలు
కలువరేకు కళ్ళ కాటుక అందాలు
ఆ కాటుక మాటున దాగిన కన్నీళ్ల కవ్వింపులు
కరిగిపోతాను ఒరిగిపోతాను
ఈ జన్మకు ఇలానే
@Lakshmi


Monday, June 20, 2016

ఇంకెక్కడి ఏరువాక...


ఇంకెక్కడి ఏరువాక...
జోడెడ్ల ఉరుకులేవి ?
నాగళ్ల పరుగులేవి ?
ఆశగా ఎదురుచూసే
ఆసామి పెట్టె  ఉండ్రాళ్ళు ఏవి ?
.
ఇంకెక్కడి ఏరువాక...
తుప్పట్టిన నాగలి తుడిచేదెవరు?
తూరుపు కంటే ముందు లేచేదెవరు?
పడమట వరదగుడితో చుట్టరికం ఎవరికి?
పంటకాలవల గట్లతో చెలిమి ఎవరికి ?

ఇంకెక్కడి ఏరువాక...
వారసత్వం లేని వ్యవసాయం
ఫ్లాటులై పోతున్న పంటభూములు
మట్టి తన వాసన తానే పీల్చలేక
ఊపిరాడక వట్టిపోతున్న వైనాలు ..
.
మొక్కను మింగి
మోడును ఊసి
పసలేదంటూ
పనికిరాదంటూ
పచ్చని చేలని బంజరుగా మార్చి
పడక గదులు పేర్చారు .
.
ఆకాశం  ఏడిస్తే 
ఓదార్చి కన్నీళ్లను కడుపులో
నింపుకునే ధరణి
కనుమరుగై
కంకర రాళ్ళ కింద తొక్కబడి
ఛావలెక  ,చావురాక
జీవచ్చవంలా పడి వుంది
.
@Lakshmi

Thursday, June 16, 2016

సేవ్ గర్ల్ చైల్డ్ ( ఎవడి పాలాన పడెయ్యడానికో....?)


తానెల్ల తనువెల్ల కళ్ళై నపుడు 
నెనెల్ల నిలువెల్ల కన్నీరైనాను
 . 
తానెల్ల తనువెల్ల ముళ్లై గుచ్చినపుడు 
నెనెల్ల నిలువెల్ల రక్తమోడినాను 

తానెల్ల తనువెల్ల తడిమినపుడు 
నెనెల్ల నిలువెల్ల అగ్గినైనాను 

తానెల్ల తనువెల్ల కామగ్నితో నిండగా 
నెనెల్ల నిలువెల్ల తగలెట్టినాను 

అమ్మనై పుడితి తనకొరకు 
అక్కనై పుడితి తనకొరకు 
చెల్లినై పుడితి తనకొరకు 
కడకు ఆలి రూపమూ ఎత్తితి ... 
.
సహవాస దోషమా .. దురహంకార రూపమా 
ఆదిశక్తినే ధిక్కరించు మగజాతి మదమా .. 

ఎగిరెగిరి మీసాన్ని మెలితిప్పుతున్నావు 
బూడిదగురోజు బొమికలైనా మిగులునా...
@Lakshmi