Saturday, March 28, 2020

వేట

మానవ మృగాల వేటకు సిద్దమవడానికి
ఆటవిక న్యాయం తెలుసుకునే
మధ్యయుగపు పేజీలలో నడుస్తున్నా..
రాతియుగపు మనిషిగా మారితేనే
వేట వేగం పెరుగుతుంది ఇప్పుడు
వేటకొడవలి పదును పెరగ్గానే వెనక్కొస్తా ..
అరడజను తలలతో
ఆ ఆది పరాశక్తికి నైవేద్యం పెట్టి శాంతిస్తా ...
అప్పుడు తీరిగ్గా
సముద్ర తీరంలో కూర్చుని
అలలతో కబుర్లు చెప్తూ
నా చరిత్ర రక్తచందనం తో లిఖిస్తా..

విప్లవం:


తూర్పు కంటే ముందే
ఊరు మేల్కొంటుంది తెలుసా నీకు
ఎప్పుడన్నా చూసావా
తుపాకీ చప్పుళ్లకు నిద్రలేచే సూర్యుడ్ని
నీలాంటి నాలాంటి చాలా మంది
పోరాటాన్ని జీవితంగా మలచుకుని
ప్రయాణిస్తున్నారు
ఎప్పుడన్నా ఎదురైతే
చెయ్యెత్తి పలకరించు "లాల్ సలాం" అని
ఆ పిడికిలి నీడ నీ జీవితాంతం తోడొస్తుంది

వీరుడు :


నెత్తుటి ధారలకెప్పటికీ మలినం అంటదు కామ్రేడ్
వీరుడి మరణం లోకాన్ని నిద్రలేపుతుంది
ఆ ఒక్కడితో ఆగిపోదు విప్లవం
ఎవడో ఒకడు పుడుతూనే ఉంటాడు
నీలోని నిన్ను నిద్ర లేపేందుకు
బ్రతుకు నేర్పేందుకు ..
నువ్వు రాయిగా మారేలోగా
తాను ప్రాణం పోసి
అడవికి దానం చేస్తాడు
నీ దేహమే తుపాకీగా మారి
నడిచే దారిమొత్తం మానవ మృగాల
వెంటాడి వేటాడుతుంది
Lakshmi KN 

Lock-Down Poetry

పోరాటాలు:
వీధుల్లో దొరికే చౌకయినా ఆవేశాలు
శ్రీ శ్రీ, తిలక్ లు రాసిపడేసిన ఎర్రరంగు కాగితాలు
బ్రతుకుదెరువుకి వలసపోయిన విప్లవ గీతాలు
దారులు మారిన ఉద్యమాల ఆర్తనాదాలు
రంగు తెలియని జెండాల నీడన రాలిపోతున్న ప్రాణాలు
ప్రాణం:
రోధన వేదనల విసిగిన గుండెల ఆక్రోశం
దశాబ్దాల దారిద్య్రం
శతాబ్దాల బానిసత్వం
పునాదులు వీడిన జీవితాల అలసత్వం..
మనిషి :
మారదు లోకం అంటూనే మార్పును కోరుకునే
మాయాప్రపంచపు మౌన గేయాలు
రాతిగుండెల మనిషికి బలయ్యి
రాయిని మొక్కే మట్టి దీపాలు
పాలకుడు:
పచ్చనోటు పాలయ్యిన
రాజకీయ రంగస్థలాన
అరగంట ఆటకు
అద్దెకొచ్చిన ఆర్టిస్టు
కవి :
దస్తాల బతుకు ..
విస్తరాకులో ఉండని మెతుకు
సిరా నిండిన కళ్ళు ..
ఆ కళ్ళనిండా ఏవో వీడని సంకెళ్లు
యవ్వనం:
కవ్వింపులు కలవరింపులు
చీకటిలో పున్నమి కలలు
కలలోనే తెల్లారే జీవితాలు
కోరికలు:
అంతుతెలియని ఆవేశాలు
మూలాలు మర్చిపోయిన
మూర్ఖపు ఆలోచనలు
రంగుల కలలు కని
లేని రెక్కల కోసం
ఉన్న డొక్కల్ని కాల్చే
అత్తరు వాసనల ప్రయాసలు

Saturday, March 14, 2020

కామ్రేడ్

నాలో ఆడతనం చూడని తోడు కావాలి
నా ఒంటి ఎత్తుపల్లాలు చూసి మీసం తిప్పని మనిషొకరు కావాలి
కొన్ని దూరాల బరువుని నాతో మోయగలిగే చేయొకటి కావాలి
నిన్ను కాచే శక్తి నాకుందని నమ్మి..
నాలో నిన్ను చూసుకునే మనసు నీకుంటే
రా కామ్రేడ్ కలిసి నడుద్దాం ..
నాచేతులు రక్తసిక్తమయినా..
నీకాళ్లకు మట్టి అంటకుండా చూసే ప్రేమ నాకుంది
పొలిమేరలు దాటి ప్రపంచాన్ని చూద్దాం ..