Saturday, March 28, 2020

Lock-Down Poetry

పోరాటాలు:
వీధుల్లో దొరికే చౌకయినా ఆవేశాలు
శ్రీ శ్రీ, తిలక్ లు రాసిపడేసిన ఎర్రరంగు కాగితాలు
బ్రతుకుదెరువుకి వలసపోయిన విప్లవ గీతాలు
దారులు మారిన ఉద్యమాల ఆర్తనాదాలు
రంగు తెలియని జెండాల నీడన రాలిపోతున్న ప్రాణాలు
ప్రాణం:
రోధన వేదనల విసిగిన గుండెల ఆక్రోశం
దశాబ్దాల దారిద్య్రం
శతాబ్దాల బానిసత్వం
పునాదులు వీడిన జీవితాల అలసత్వం..
మనిషి :
మారదు లోకం అంటూనే మార్పును కోరుకునే
మాయాప్రపంచపు మౌన గేయాలు
రాతిగుండెల మనిషికి బలయ్యి
రాయిని మొక్కే మట్టి దీపాలు
పాలకుడు:
పచ్చనోటు పాలయ్యిన
రాజకీయ రంగస్థలాన
అరగంట ఆటకు
అద్దెకొచ్చిన ఆర్టిస్టు
కవి :
దస్తాల బతుకు ..
విస్తరాకులో ఉండని మెతుకు
సిరా నిండిన కళ్ళు ..
ఆ కళ్ళనిండా ఏవో వీడని సంకెళ్లు
యవ్వనం:
కవ్వింపులు కలవరింపులు
చీకటిలో పున్నమి కలలు
కలలోనే తెల్లారే జీవితాలు
కోరికలు:
అంతుతెలియని ఆవేశాలు
మూలాలు మర్చిపోయిన
మూర్ఖపు ఆలోచనలు
రంగుల కలలు కని
లేని రెక్కల కోసం
ఉన్న డొక్కల్ని కాల్చే
అత్తరు వాసనల ప్రయాసలు

No comments:

Post a Comment