Saturday, April 11, 2020

19వ మైలు

19 వ మైలు
జీవితం 100 మైళ్ళ ప్రయాణం
అన్నీ దశలు దాటి
అనుభవాలతో ఎదో ఒక మైలు దగ్గర ఆగిపోతాం ....


తానూ అంతే అందరిలానే
కోరికలు
ఆశలు
ఊహలు
ఎలా బ్రతకాలని ..
లెక్కలేనన్ని ఊసులు నక్షత్రాలతో చెప్పుకుంటుంది

సన్నజాజి చెట్టు రోజూ తనకోసమే
రెండు మూరల జడకు మూడు మూరల పూలు పూస్తుంది
అన్నతో రోజూ
మంచి నీళ్ల బావి దగ్గరకి  వెళ్తూ ఊరి చివరి పోతురాజుకి మొక్కింది
పెద్ద ఇల్లు, ఇంటి నిండా పూల చెట్లు ఉన్న వాడితో పెళ్లి కావాలని

వసంతత్త కొబ్బరి తోటలో బంతి నారు పోస్తే
మావయ్య వెంట పడిమరి పసుపు పచ్చ బంతి  మొక్క తెచ్చుకుంది
అమ్మ ఆదివారం తలంటి ఒక్క జడ వేస్తే
ఆ పువ్వు
నల్లని జడలో నిండు పున్నమిలా కనిపిస్తుంది ..

ఉన్న ఒక్క జత యూనిఫామ్ ఆమె చదువాపలేదు
నాన్నకు వాళ్ళక్క మీద ఉన్న నమ్మకం ఆపింది
అది సడిలాకా,
ఆ పిల్లకు పొలం పనులన్నీ వచ్చాక,
మళ్ళీ చదువు పట్టాలెక్కింది
ఇంకో జత బట్టలు కొనుక్కుని
ఇక సూపర్ ఫాస్ట్ ఎక్కేసా అనుకుంది..

ఇష్టపడి కనకాంబరం రంగు పరికిణి కొనుక్కుంది ఆ ఏడు తిరణాల కోసం
అదే రంగు మట్టి గాజుల తెమ్మని
సిలారి వెంట రెండు వారాలు పడింది
రెండు రోజుల నుండి కుమారి గారింట్లో కనకాంబరాలకు కాపలా ఉంది

పున్నమివెన్నెల్లో శివయ్య జాతరలో
ఎవరినీ పట్టించుకోకుండా రాములోరి గుడి నుండి ఊరి ఈదరి దాకా 
రాత్రంతా ఆడుతూ తిరుగుతూనే ఉంది
రంగుల రాట్నం ఎక్కి  అది పైకివెళ్ళినప్పుడల్లా
శావయ్య  గారి కొష్టం మీదుగా చంద్రుడి కోసం చేయి చాచింది
అతను ఆమెతో ఆడుతున్నాడనే అనుకుంది
అప్పుడు ఆమెకి పద్దెనిమిదిని దాటి  నలభై ఐదురోజులు

పండగలయ్యాయి పంటలయ్యాయి
చదువులకు వెళ్లిన వాళ్ళు సెలవులకు వచ్చారు
ఊరి చివరి గుడిసెకి ఊర్లో విషయాలు తెలియవు
కొన్ని సార్లు తెరిచిన తలుపులు చూసి ఊరకుక్కలు తొంగి చూస్తాయి
తెలుసుకుని తలుపు చాలా సార్లు మూసింది


మూర్ఖత్వానికి, రాక్షసత్వానికి
చెరిపేస్తే చెరిగిపోయే గీతలే అడ్డు
ఆ రాక్షసత్వానికి  ఆ 19 వ మైలు రాయే సాక్షం
ఎప్పుడూ నక్కల ఊళలకే భయపడే ఆమె
తోడేళ్ళ గుంపుని చూసింది కొత్తగా ..
రెండు పదులు దాటని ఆమె రెక్కలు విరిగిన పక్షిలా నేల కొరిగింది
మనసు ఇక కోలుకోదని తెలిసి ఉత్త  ప్రాణం  పోసుకుని ఇంటికొచ్చింది
సన్నజాజి పాదులన్నీ పీకి పారేసింది వస్తూనే

తనలో అంతులేని శూన్యాన్ని  చూస్తూ
స్తంభించిన ఊపిరిని బ్రతిమాలుకొని దూరంగా పారిపోయింది

కొన్నేళ్ల పాటు గాయాల్ని, వాటి గుర్తుల్ని  మోసింది
గుండెలవిసేలా .. ఒంట్లో రక్తం ఇంకేవరకు కన్నీరు కార్చింది

ఆవేదనికి కూడా అలసత్వం ఉంటుంది
అప్పుడే ఆలోచన పుడుతుంది
ఆలోచన అరక్షణంలో ఆవేశంగా మారుతుంది
పారిపోయిన ఆ పల్లెటూరి లేడిపిల్ల
ఆటవిక ధర్మాన్ని ఆచరణకు తెచ్చుకుంది

చట్టాలు తెలిసిన చొక్కాల దగ్గర
సిద్ధాంతాల రాద్ధాంతాలు చెల్లుబాటవ్వవు
అన్ని న్యాయాలు సిరాతో రాయబడవు
కొన్నిటికి రక్తపు హంగులు దిద్దాలి
మరికొన్నింటికి శ్మశానఘంటికలు వినిపించాలి

"
నేను నిజం కాదు
రాస్తుంటా తెల్లటి కాగితాలమీద
కానీ ఒక్కసారి
కళ్ళను మూసి మనసుతో చూడు
ఏ అమావాస్యలోనో ఒంటరిగా మిగిలిన ఆ నేను
అదే ఘాట్ రోడ్ మీద నడవలేక
రక్తపు టేరులో స్పృహ కోల్పోయి ఉంటాను
ఇంకా నేను అక్కడే ఉన్నాను "
తానొచ్చి ప్రతిరోజు అర్ధరాత్రి  నిద్రలేపుతుంది
వచ్చి కాపాడమని ఏడుస్తూ ...

తానింకా అక్కడే ఉంది ..
ఆ 19వ మైలురాయి దగ్గరే ఆ తోడేళ్ళ సమాధిని చూడాలని అక్కడే ఎదురుచూస్తూ ఉంది

@Lakshmi



No comments:

Post a Comment