Tuesday, September 8, 2015

1000 ఎకరాల ఆసామి అయినా 100 రూపాయల కూలివాడయినా పోయేది ఆ కాటికే....



చెప్తే విడ్డూరం అంటారు గానీ
అనుభవించే వాడికి తెలుస్తుంది బాధేంటో
ఈ మధ్య రిజర్వేషన్లు ఉండకూడదు అని తెగ చించుకుంటున్నారు
మా వూరు రండి చూపిస్తా ,ఉంచాలో తెంచాలొ అప్పుడు తెలుస్తుంది.
మా ఇంటిముందు మేము కుర్చీలో కూర్చుంటే
ఆ రోడ్డున పోయే పెద్దాయన కోసం లేచి నిలబడి సలాం కొట్టాలి ,
లేకుంటే రేపొద్దున
పొలానికి నీళ్ళు రానివ్వరు
పెట్టుబడికి వూళ్ళో అప్పు పుట్టనివ్వరు.
గుళ్ళో పూజారి ప్రసాదం పెట్టడు
మేము వెళ్తే గుళ్ళో దేవుడు మాయం అవుతాడనేమో
పదిమందిలో భోజనం తిననివ్వరు.
మేము వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళ కడుపు నిండదేమో
ఎర్రటి ఎండలో రోజంతా పని చేస్తే కూలిడబ్బులు
ఇవ్వడానికి ఏడ్చి చస్తారు .
మా పిల్లలు బడి కెళ్తే ఆళ్ళు ఫీజు కట్టినట్టు భోరున ఏడుస్తారు
వాళ్ళకు పాలేర్లు కరువవుతారని,
మా ఆడపిల్లలు రోడ్డున పోతుంటే వెంటపడి వేధిస్తారు
వాళ్ళకు ఆడపిల్లలు లేనట్టు
మేమొప్పుకుంటాం తక్కువ కులం వాళ్ళని
కాని ఎప్పటికి ఒప్పుకోం గుణం తక్కువ వాళ్ళమని .
ఒకడికి తినటానికి వుండదు,
నాది పెద్ద కులం అని బట్టలు చించుకుంటాడు
ఇంకొకడికి కట్టుకున్న పెళ్ళామే మాట వినదు ,
సెంటర్లో కూర్చొని కుల పెద్దనని అని విరుచుకుంటాడు.
నువ్వు పెద్దకులమని తినకుండా వుంటే కులం కడుపునింపదు
కులం పచ్చబొట్టు వేయించుకున్నంత మాత్రాన వచ్చే చావు ఆగదు
ఎవడు చచ్చిన పూడ్చేది ఆరడుగుల గోయ్యిలోనే
నీ కులపోల్లే నువ్వు కంపుకొడుతున్నావని
ఊరిచివర విసిరి పారేస్తారు
నీ కులపోల్లే నువ్వు కుళ్ళి పోతున్నవని తగులబెడతారు
1000 ఎకరాల ఆసామి అయినా
100 రూపాయల కూలివాడయినా పోయేది ఆ కాటికే.....
@Lakshmi

No comments:

Post a Comment