ఆదివారం
నా పాత పుస్తకాలు అన్ని సర్దుతుంటే
ఒక చిన్న బాక్స్ కనపడింది
ఆ బాక్స్ చూస్తుండగానే
నా ఆలోచనలు మా వూరు వెళ్ళాయి
కాలువగట్టు దాటగానే తుమ్మ చెట్టు
అక్కడనుండి ఈశాన్య మూలాన వుంటుంది
మా పొలం
గట్టుకి ఆవల వాళ్ళ పొలం ఇవతల మా పొలం
తాగడానికి నీళ్ళు కావాలంటే రెండు పొలాలకు ఒకటే కాలువ
వాళ్ళ పొలానికి పనికెళ్ళేదాన్ని
పెద్దాయన రెండో కొడుకు నాకు బాగా పరిచయం
కొంచెం కొంటెతనం ఎక్కువ... సరదాగా వుండేది
ఎప్పట్లానే పనికెళ్ళా
వాళ్ళ అమ్మ పొలం మధ్యలో ముద్ద బంతి చెట్టు నాటింది
అరచెయ్యి వెడల్పుంది పువ్వు
ఆమెకు వయసైపాయింది
ఇంట్లో ఆడపిల్లలు లేరు అందుకే పువ్వు ఎవరూ కోయలేదు
నాచూపు దానివైపే వుంది
నేను తిరిగి చూసే సరికి చెట్టుకి పువ్వు లేదు
పని చేస్తూ పువ్వునే చూస్తున్నా
దాహంగా అనిపిస్తే కాలువ దగ్గరకెళ్ళి
నీళ్ళు తాగొచ్చా ....
వచ్చి చుస్తే పువ్వు కనిపించలేదు
నాతో పనికొచ్చిన వాళ్ళే కోసారనుకున్నా
చెట్టు వైపు చూపు ఆపేసి
పని చేసుకుంటున్నా ....
వీపున ఏదో చిన్నది తగిలింది
ఏదో అనుకుని చూసుకోలేదు
మళ్లీ తగిలింది చుస్తే చిన్న మట్టి గడ్డ
చుట్టురా చూసా ఎవరు కనపడలేదు
మళ్లీ తగిలింది వెనక్కి తిరిగా
పెద్దాయన కొడుకు
గట్టు మీద నిల్చొని పిలుస్తున్నాడు..
చుస్తే బాగోదు వద్దు అని సైగ చేశా వింటేగా
మళ్లీ రాయి తీసుకున్న కొట్టడానికి
వినేలా లేడు
చుట్టూరా చూసా అందరు పనిలో వున్నా
చిన్నగా చెట్టు వైపు వెళ్ళా
వెళ్తూనే " పనేం లేదా ఎవరన్నా చుస్తే ..."
"ఎహె...! చూడరులే రా తొందరగా "
అంటూ చెట్టు కింద కూర్చున్నాడు
ఏంటో తొందరగా చెప్పు నేను వెళ్ళాలి అన్నా
వెనక నుండి పెద్ద పసుపు రంగు బంతిపూవు తీసాడు
నాకు తెలుసు నా ఇష్టాలు నేను చెప్పకుండానే
తనకి తెలుస్తాయని ....
వెంటనే పువ్వు లాక్కొని పొలంలోకి పరిగెత్తా ....
మావి చిన్న చిన్న సరదాలైన ఇష్టం మాత్రం పెద్దదే ....
మా ఇష్టం కాలువ గట్లు దాటి ,
ఊరి పంచాయితి చేరింది....
కులాలు వేరని కనికరించలేదు పెద్దలు
కాలానికి ఎదురీదలేక కలిసే దారిలేక
కాల్లీడ్చుకుంటూ కదిలా ఊరొదిలి
కంటి పాప కష్టం ధారలుగా పారాయి
తుడిచే దిక్కులేక లోలోన కుమిలిపోయా ....
తానిచ్చిన బంతి పువ్వుని
తన మనసనుకొని నాలోనే దాచుకున్నా
ఏళ్ళు గడిచినా .....గుర్తొస్తే బాధ కొత్తగానే వుంది .
@Lakshmi
No comments:
Post a Comment