Monday, December 28, 2015

మాకెందుకు స్వాతంత్రం


స్వాతంత్రం పేరు చెప్పి
అడుగు బయట పెట్టగానే
అర లీటరు యాసిడ్ పోసేట్టయితే
మాకెందుకు స్వాతంత్రం
పెద్ద చదువు కోసం
ఊరు దాటగానే
వోణి పట్టి లాగేట్టయితే
మాకెందుకు స్వాతంత్రం
ఉద్యోగం కోసం పక్క ఊరికేల్తే
మానం పోగొట్టుకునేట్టయితే
మాకెందుకు స్వాతంత్రం
మనువు పేరు చెప్పి
మనసివ్వలేని వాడికి
తనువుని తాకట్టు పెట్టాల్సి వస్తే
మాకెందుకు స్వాతంత్రం
బాధ్యతల పేరు చెప్పి
బంధాల ముడులు వేసి
బంధీని చేస్తున్నపుడు
మాకెందుకు స్వాతంత్రం
పురిటిలోనే నాజాతిని
నరకయాతన పెట్టి
వీధి కుక్కల పాలు చేస్తున్నపుడు
మాకెందుకు స్వాతంత్రం
బానిసలుగా అలవాటుపడ్డ మాకు
స్వాతంత్రం పేరు చెప్పి
కొత్త ఆశలు పుట్టించి
సరికొత్త హింసలు
బహుమతిగా ఇచ్చేట్టయితే
మాకెందుకు స్వాతంత్రం

@Lakshmi

Thursday, December 24, 2015

మార్చుకున్న తలరాత


ఆమె తిరిగొచ్చింది
చేతులు విరిగాయని కొందరంటున్నారు
కొత్తగా రెక్కలోచ్చాయని మరికొందరంటున్నారు.
అక్షరాలతో ఆడుకునేదేగా అని పలకరించబోయాడొకడు
ఆయుధం పట్టిన సంగతి అర్దమవ్వలేదేమో మరి
ఆమె నిజంగానే తిరిగొచ్చింది
కాలువలు గట్టిన తన కన్నీటి సుడిగుండాల్లో
కొట్టుకుపోతుందనుకున్నారు అందరు.
ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో అర్ధంకాక
ఆమె వేస్తున్న ప్రతీకార లెక్కల్లో
ఎవరి వంతు ఎప్పుడొస్తుందో అనుకుంటూ
వాళ్ళ వాళ్ళ  పాపాల లెక్కల్ని బేరుజు వేస్తున్నారు.
ఈ వరుసలో ఎవరు ముందున్నారో మరి ?
వరుసలో ఎవరు ఎక్కడ వున్నా
వేయబోయే శిక్షలో మార్పులేదు.
కోపంతో ఎరుపెక్కిన కళ్ళను
నల్లటి కళ్ళద్దాలతో కప్పేసింది.
నిన్నటి ఆమెలో వున్న భయం బాధ
ఈరోజు వెతికినా కనబడడం లేదు.
ఆమె తిరిగొచ్చింది
ఆమె తన గతానికి సమాధానం చెప్పడానికి వచ్చింది
రేపటికి స్వాగతం చెప్పడానికి వచ్చింది
@Lakshmi

Tuesday, December 8, 2015

నా కోట్లకు పునాది నీ ఆకలేరోయ్



******************************
నాకెందుకు ఇదంతా
అయినా నీకు సేవ చేయాలనుంది
అందుకే
నీ గురించి పుస్తకం రాస్తా
ఒక్కో పుస్తకాన్ని 10 రూ/- అమ్ముతా
1000 పుస్తకాలకు 10000 వేలు వస్తాయి
వాటితో నీ గురించి షార్ట్ ఫిల్మ్ తీస్తా
దానితో లక్ష రూపాయలు వస్తాయి
వాటితో నీకోసం ట్రస్టు పెడతా
విరాళాలు కోట్లలో వస్తాయి
ఆ కోట్లలో ఒక లక్ష నీ పేరు చెప్పి
ప్రెస్ మీట్ పెట్టి
నీలాగే మావాడికి వేషం వేసి
దానం చేస్తాం
దాంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టేస్తా
నీ పేరు చెప్పిప్రభుత్వం నుండి వచ్చే
గుడి, బడి, తిండి, గుడ్డ అన్నీ
నా కడుపుకే..
రిజర్వేషన్ నీది రాచరికం నాది
నీపేరుతో నాకు పద్మశ్రీ లు
పద్మ భూషణ్ లు ..
హ హ నీకు మాత్రం
ఆ పూరి పాకనే...
నాకు కోపం వస్తే
ధర్నాలు, రాస్తారోకులు
నువ్ అడుక్కు తినడానికి కూడా
నా కనికరం వుండాల్సిందే ..
అయినా ఇదంతా నాకెందుకు
నా బ్రతుకు నాది
నీ బ్రతుకు నీది
కాని నా కోట్లకు పునాది మాత్రం నీ ఆకలేరోయ్ ...
.
@Lakshmi

పాత పలక



ఏడేళ్ళ వయసు అంటే
బడి, ఆటలు పాటలు, స్నేహితులు
ఇది అందరికి తెలిసింది...
కాని వాడిది దోవ వేరు,
పొద్దున్నే లేచి
అయ్యోరి పొలానికి గంధకం కొట్టి ,
గొడ్ల సావిడి శుభ్రం చేసి ,
అమ్మ కాసిచ్చే
ఆ కొద్ది గంజి కోసం
వాకిట్లో దొంతి కూర్చొని
ఉన్న ఒక్క చొక్కాకి బొత్తం
కుట్టుకుంటున్నాడు.
సూది చేతిలో గుచ్చుకుంటున్నా
వాడికి తెలియదు ,
వాడు ఈరోజు బడికి పోబోతున్నాడు
మొట్ట మొదటి సారి బడికి పోతున్నాడు
నిన్న రాత్రి నుండి కలలు కంటున్నాడు
అమ్మ గంజి కాసిచ్చే వరకు కుడా ఆగలేక
చొక్కా తొడుక్కుని
అయ్యోరి పిల్లాగాడి పాత పలక
శుబ్రంగా కడుక్కుని చంకలో పెట్టి ,
బడికి సిద్దమయ్యాడు ..
ఎండుకు పోయిన కడుపు
వాడికి దారికి అడ్డు రాదు.
చిరిగి పోయిన చొక్క
వాడి ధైర్యాన్ని దేబ్బతీయలేదు..
ఎగిరెగిరి పడే వాడి అడుగుని
గులక రాళ్ళు ఆపలేవు ..
ఒక్క బానిస బ్రతుకుకి
వాడి బాల్యాన్ని బలిచేసే
పెత్తందార్ల స్వార్ధం తప్ప ..
.
@Lakshmi