Tuesday, December 8, 2015

పాత పలక



ఏడేళ్ళ వయసు అంటే
బడి, ఆటలు పాటలు, స్నేహితులు
ఇది అందరికి తెలిసింది...
కాని వాడిది దోవ వేరు,
పొద్దున్నే లేచి
అయ్యోరి పొలానికి గంధకం కొట్టి ,
గొడ్ల సావిడి శుభ్రం చేసి ,
అమ్మ కాసిచ్చే
ఆ కొద్ది గంజి కోసం
వాకిట్లో దొంతి కూర్చొని
ఉన్న ఒక్క చొక్కాకి బొత్తం
కుట్టుకుంటున్నాడు.
సూది చేతిలో గుచ్చుకుంటున్నా
వాడికి తెలియదు ,
వాడు ఈరోజు బడికి పోబోతున్నాడు
మొట్ట మొదటి సారి బడికి పోతున్నాడు
నిన్న రాత్రి నుండి కలలు కంటున్నాడు
అమ్మ గంజి కాసిచ్చే వరకు కుడా ఆగలేక
చొక్కా తొడుక్కుని
అయ్యోరి పిల్లాగాడి పాత పలక
శుబ్రంగా కడుక్కుని చంకలో పెట్టి ,
బడికి సిద్దమయ్యాడు ..
ఎండుకు పోయిన కడుపు
వాడికి దారికి అడ్డు రాదు.
చిరిగి పోయిన చొక్క
వాడి ధైర్యాన్ని దేబ్బతీయలేదు..
ఎగిరెగిరి పడే వాడి అడుగుని
గులక రాళ్ళు ఆపలేవు ..
ఒక్క బానిస బ్రతుకుకి
వాడి బాల్యాన్ని బలిచేసే
పెత్తందార్ల స్వార్ధం తప్ప ..
.
@Lakshmi


No comments:

Post a Comment