Thursday, April 28, 2016

ప్రేమ కెరటం


ఎన్ని సార్లు ఎగురుకుంటూ ఒడ్డుకోచ్చానో
నిను ముద్దాడాలని
నీ ముందుకు రాగానే
ఏదో సిగ్గు వెనక్కు లాగేస్తుంది
.
వెనక్కి వెళ్ళిన వెంటనే
మళ్లీ చూడాలనే గుబులు
నీవైపే లాక్కొస్తుంది .
.
నీచేతులలో చేరేలోపు
నీదాన్ని కాలేనెమో అన్న బెంగ
వెనకడుగు వేయిస్తుంది
.
నిన్ను విడిచి ఉండలేక మనసు
మరో కొత్త అలలా
నీ పాదాలను తాకుతుంది
@Lakshmi

మా హిట్లర్ తో మరో చరిత్ర


(@ చౌదరి గారి అబ్బాయ్ ) 

ఏమరపాటుగా ఈనాడు చదువుతూ వాకిట్లో కూర్చున్న రోజులు అవి
ఓ రోజు సాయంత్రం
పోద్దుపోకముందే ఆఫీసు నుండి గూటికి చేరి
స్టీల్ గ్లాసులో హాస్టల్ టీ పోసుకుని
ఫస్ట్ ఫ్లోర్ లోవుండి ప్రపంచాన్ని చూస్తున్నా ...
ఖాళీగా ఉన్న కాలనీ లోకి
ఒక్కసారిగా ఒక ఏడుగురు ఎక్కడినుండో ఊడిపడ్డారు
చూస్తె  సైటేస్తుందనుకుంటారు
చూడకపోతే షో చేస్తుందనుకుంటారు
ఈ మగాళ్ళు అంతే ...
అయినా నాకేం భయం .
పక్కనున్న బాదం చెట్టుకింద కూర్చొన్న తెల్ల కుక్క పిల్లను చూస్తున్నా...
.
ఏడుగురులో నలుగురు ఎదురుగా ఉన్న హాస్టల్ లోపలి వెళ్ళారు
మిగిలిన ముగ్గురు , చోటు సరిపోక పోయినా అదే హాస్టల్ అరుగుపై కూర్చున్నారు
నాకేం పని .. నేనెందుకు చూస్తా ..
టీ అయిపొయింది ... ఖాళీ గ్లాస్ పట్టుకుని
ప్రపంచానికి ఈ పూటకు బై చెప్పి 
రూం లోకి తిరగబోయా..
.
నా ఎడం వైపు ఉన్న గుండెకి ఏదో అయ్యింది
ఒక్కసారి ..ఇంకోసారి ..మరొక్కసారి ...
చూడు చూడు అని కళ్ళని మొండికేసి మరి అటువైపు తిప్పింది
వద్దన్నా వినకుండా ...
.
ఆరు అడుగులున్న గుమ్మలోనుండి
ఆరున్నర అడుగులున్న అందగాడు బయటకొచ్చాడు
.
ఏడుగురులో ఏ ఒక్కడు కాదు వీడు
అప్పుడే వచ్చాడు
తెలుగోడిలా లేడు.. మరి ఏ భాష , ఏ ఊరు
.
రోజుకో అరగంట చొప్పున
షెడ్యూల్ వేసుకుని మరి రెండు వారాలు సైట్ కొట్టా
వీకెండ్స్ అయితే స్పెషల్ క్లాసు...
.
ఆ ఏడుగురితో కలిసి ఎనిమిదో వాడిగా
ఒకరోజు బయట కెల్లోస్తూ ..
తెలుగోడే అన్న విషయం బయటపడేసాడు
.
మనసు ఎగిరి గంతేసింది .. మనోడేలే.. చెప్పడం సులువేలే అన్నట్టు ..
ప్చ్ ఎగిరినా అందడు .. అంత హైటు మరి
హైటు చూసే పడ్డా మరి...
.
ఓ శనివారం సాయంత్రం
ఎన్ని గ్లాసుల టీ తాగినా , ఎంతకీ కనిపించలేదు
ఏడుగురిలో కనీసం ఒక్కడూ లేడు
ఎనిమిదవ్వోస్తుంది .. ఎలా తెలుస్తుంది
ఏమయ్యారు , ఎవరినడగాలి ...
మిస్సయ్యనా ?...
.
మెంటలోడు మెల్లగా లోపల గదిలోంచి వచ్చాడు
నిద్రపోయినట్టున్నాడు
ఎప్పుడు పక్క చూపులు చూసేదాన్ని
మిగతావాళ్ళు లేరుగా .. నేరుగా అతన్నే చూడడం మొదలెట్టా
మనసుపెట్టి మరి చేసిన పని కదా
వెంటనే తగిలిందనుకుంటా నా చూపు ,
వెంటనే అతని తొలిచూపు నావైపు   ..
.
చూపుల్లోని ప్రేమలేఖలకు
ప్రత్యుత్తరం పాజిటివ్ గానే వచ్చింది
.
నా మార్నింగ్ వాక్ సమయం ఒక గంట పెరిగింది..
అతని జిమ్ లో వుండే టైం తగ్గి
జిమ్ బయట టీపాయింట్లో గడిపే టైం పెరిగింది... 
అయినా వాడి సిక్స్ ప్యాక్ లో ఏమార్పు లేదు.
బై బర్త్ వచ్చాయేమో మరి...
.
ఇప్పుడు
కాలంతో పాటు కలల్ని కంటూ
వాటిని జ్ఞాపకాలుగా మార్చుకునే పనిలో వున్నాం 

@Lakshmi

Thursday, April 21, 2016

ఆరాధన // మా చౌదరి గారబ్బాయ్ కోసం




ఆరాధన
అవును ఆరాధన
నా మనసు నీ తలపులలో చిక్కుకున్నప్పుడు
అదేంటో తెలుసుకుందామని
ఆవేశంగా నీవైపు రాగానే
ప్రేమగా చూసే నీ కళ్ళను చూడగానే
చెప్పకనే తెలిసిపోయే మధురమైన మైమరపు
ఈ ఆరాధన ……….
.
ఆరాధన
అవును ఆరాధన
అలలు అలలుగా ఎగసిపడే
మనసులోని కోరికలు
నీ పాదాల్ని తాకగానే
సిగ్గుతో తలవంచుకుని
ఒక అడుగు వెనక్కి తగ్గి
పాదాభివందనం చేస్తూ
నీ చేతి స్పర్సకోసం ఆశగా చూస్తున్నప్పుడు
కలిగే వలపు
ఈ ఆరాధన
.
ఆరాధన
అవును ఆరాధన
కౌగిలిలో కరిగిపోవాలని
కలలు కంటూ
వాకిటనే నా తలపులకు కావలి కాస్తూ
మాపటికి నువ్వు తెచ్చే మల్లెమొగ్గల కోసం
మౌనంగా మాట్లాడే భాషే
ఈ ఆరాధన
.
ఆరాధన
అవును ఆరాధన
తొలిజాము కోడికూతకు
మరో ఘడియ మిగిలుందన్నప్పుడు
మనసు మౌనంగా
నిట్టూర్పుల వేడిని వదిలి
నీ నూనుగు మీసాలను
తాకుతూ పరవశించి పాడే పాటే
ఈ ఆరాధన
.

ఆరాధన
అవును ఆరాధన
నా అణువణువునా నిండిన
నిన్ను చూసి ,
నీ మనసే ఈర్ష్య పడేలా
నన్ను నేను రూపాంతరం చెందుతూ
నీకోసం ఇప్పటికి వాకిలిలో
ఎదురుచూస్తూ పడే ఆరాటమే
ఈ ఆరాధన
.
ఆరాధన
అవును ఆరాధన
పొద్దున్నే పూసే మందారం దగ్గరనుండి
సాయంత్రం విరిసే విరజాజి వరకు
అడిగి తెలుసుకో
నీకోసం నీలాకాసం వైపు చూస్తూ
పొద్దుపోయే సమయం కోసం ఎంత వేచానో
ఆ ఎదురుచుపుల ఎరుపెక్కిన కళ్ళ ఆశే
ఈ ఆరాధన
.
ఆరాధన
అవును ఆరాధన
నీకోసం నా మనసు ఎన్నిసార్లు
కూనిరాగాలు తీస్తూ
కునికి పాట్లు పడుతూ
వాలిపోయేపొద్దుని విరహంతో లెక్క కడుతూ
నువ్వొచ్చే వరకు చుక్కలన్నిటిని
చిక్కని మాల గట్టి
ఆ గుప్పెడు మల్లియలని
తడుముతూ ఎదురుచూసే
మెత్తని తలపే
ఈ ఆరాధన
@Lakshmi

Tuesday, April 19, 2016

ఆ నేనే

నేను
నేను నేనే
నేను ఆ నేనే
ఆ నేనే నీకోసం వచ్చాను
.
నీకోసం
ఆ మాగాణి గట్టు మీద
ఆ చింతతోపు దగ్గర
ఆ మాసారపు రత్తయ్య బావిదగ్గర
ఎదురుచూసిన ఆ నేనే
నీకోసం వచ్చాను
.
మీ మిరపతోట దగ్గర
మీ బాబాయి చేపల చెరువు దగ్గర
మీ యర్రవోరు బజారు వేప చెట్టు దగ్గర
నిన్ను వెతుక్కున్న ఆ నేనే 
నీకోసం వచ్చాను
.
ఏసుబాబు 2 ఎకరాల పత్తి దగ్గర
బొడ్డు అప్పారావు వాగొడ్డు మెట్ట దగ్గర
కుమ్మరి కోటయ్య తుమ్మ చెట్టు దగ్గర
నీకోసం కాచుక్కూచున్న ఆ నేనే
నీకోసం వచ్చాను .
.
.
ఇప్పటికైనా ఇస్తావా
పదేళ్ళ కింద తీసుకున్న నా  5 రూపాయలు
.
.
@Lakshmi