Wednesday, May 11, 2016

నాకక్కర్లేదు


మాట్లాడని అక్షరాలు నాకక్కరలేదు
మరణించిన మనసులు అసలక్కర్లేదు
.
ముట్టుకున్నా వాసన తెలియని ఎరుపురంగులు
ఎంత ఎత్తున వున్నా విలువతెలియని రెపరెపలు
వెలిగించినా వెలుగునివ్వని వ్యవస్థలు
బయటకొచ్చి ప్రపంచాన్ని చూడలేని బెక బెకలు
నాకక్కర్లేదు
.
కళ్ళున్నా చూడడానికి ఇష్టపడని చూపులు
బ్రతికున్నా ఇంకొకరి బ్రతుకుకోరలేని జీవితాలు
చలనం లేక చంచలత్వం వచ్చిన రాతి శాసనాలు
కంచర గాడిదలకు కాపలా కాసే యునిఫారంలు
నాకక్కర్లేదు
.
నేనేంటో.. నాకు నేనేంటో ..
నా వరకే పరిమితమయ్యే ఈ సిద్దాంతాలేంటో
ఏదో రోజు నీ వరకు రావా ..
అప్పుడు కూడా నువ్విదే అంటావ్
"నాకక్కర్లేదు " అని
@Lakshmi

Tuesday, May 10, 2016

మరో " ఆత్మ " కథ

నిన్న నేను చంపిన హృదయం
స్మశానంలో సగం తగలబడి
అనాధ శవంలా అలానే ఉండిపోయింది .
మరో " ఆత్మ " కథ
అనంతం లో కలిసిపోతుంది
ఇన్నాళ్ళు చదివిన కథలు
కథలని తెలిసి కూడా
కన్నీళ్లు పెట్టిన నా హృదయాన్ని
కంటిలో చెమ్మ కుడా రాకుండా
కాల్చి పడేయాల్సి వచ్చింది ...
దాని కోసం అది కూడా
ఏడవలేకుండా కళ్ళు పీకి
నిర్దాక్ష్యణ్యంగా కొట్టి చంపా ...
నిన్న చంపిన నా హృదయం
రక్తపు మరకలు
ఈరోజు నా ఉతికిన చొక్కాకి
కొత్తగా అంటుకున్నాయి
తనకోసం కన్నీళ్లు కార్చలేక పోయా అని
నా దేహం తను ఖాళి చేసిన భాగాన్ని
రక్తంతో నింపింది ...
సమాజంలో బ్రతకడానికి
దాన్ని చంపాను
తనులేక ఉండలేక
నన్ను నేను చంపుకుంటున్నా
హత్యా లేక ఆత్మ హత్యా
లేక అంతరాత్మ హత్యా ?
కాదు కాదు
ఇది అంతరాత్మ చేసుకున్న
" ఆత్మ" హత్య
@Lakshmi

Just for Fun

అర్దరాత్రి ఆకలయి మెలకువ వచ్చింది
అనిపించిందే తడవుగా మహాబార్ బుక్ లోని వైట్ పేపర్ తీసా
నా ఇంటర్ లో మా ఫిబీ మేడం చెప్పిన
నాలుగు మంచిమాటలు పేపర్ పై రాసుకున్నా
కొంచెం స్పైసిగా వుండాలని
రెండు శ్రీ శ్రీ గారి లైన్లను దానికి కలిపా
మళ్లీ ఉప్పు తక్కువ అవుతదేమో అని
మా NSR గారి లైన్లు ఒక అయిదు కలిపా
పేపర్ ఫుల్ అయ్యింది
ఇంక తిందాం అని మడత పెట్టా
ఇంతలో మసాలా తక్కువ అవుతుందేమో
అని అనుమానం వచ్చి
నాకు ఇంగ్లీష్ నేర్పిన కమలిని ముఖర్జీ
అనగా మా B Tech ఇంగ్లీష్ లెక్చరర్ ...
ఆవిడ పలికిన నాలుగ ఇంగ్లీష్ పదాలు వేసా ..
వహ్... సూపర్ ..
తినబోతుండగా .....మధ్యలో
మా కెమిస్ట్రీ మాస్టర్ RK గారు చెప్పిన విషయం గుర్తొచ్చింది
" చదవని రోజున తినే హక్కు లేదని "
వెంటనే పేస్బుక్ ఓపెన్ చేసి రెండు పోస్ట్ లు చదివేసి
గబా గబా తినేసి పడుకున్నా
.
@Lakshmi

పల్లెటూరిలో ప్రేమ

అప్పుడు ఫోన్లు లేవు
ఒకే వూర్లో వుంటాం కాబట్టి ఉత్తారాలు అక్కర్లేదు
మాట చెప్పడానికి మధ్యవర్తులు లేరు
రేపు ఎప్పుడు కలవాలి అని చెప్పుకోలేదు
వూరి మధ్యలో వాళ్ళ ఇల్లు
వూరి చివర మా ఇల్లు
అయినా కలిసేవాళ్ళం
ఏకాంతం అనే మాట అసలే లేదు
కలిసి ఉన్నంత సేపు సిగ్గుతో మాటలు రావు
ఆ... ఊ.. అనుకునే లోపు ఎవరో ఒకరు వచ్చే వాళ్ళు
ఇష్టం అంతా కళ్ళతోనే మాటలన్నీ సైగలతోనే
అప్పుడప్పుడు గట్టు మీద నాకోసం పడేసే బంతి పువ్వు
పువ్వు పెట్టుకుని పొలానికెళ్తే పెళ్ళాన్నయిపోయినట్టే అని సంతోషం
దాహం అవ్వకపోయినా కాలువ దగ్గరకొచ్చి కలిసి పోవడం
వస్తానని చెప్పకపోయినా వచ్చేవరకు ఎదురుచూడ్డం
రాగానే సిగ్గుతో పారిపోవడం
నాకోసం విసిరిన రాళ్ళు పక్కన పని చేసే పిల్లకు తగలడం
కనపడకుండా చెట్టు చాటున కూర్చొని దాక్కోడం
సంబంధం లేకపోయినా నేను పనిచేసే పొలానికొచ్చి
అవసరం లేకపోయినా పొలం యజమానికి సాయం చేస్తున్నట్టు
నాకు సిగ్నల్స్ ఇవ్వడం
పని లేని రోజున నన్ను చూడ్డానికి స్నేహితుడినేసుకుని
అవసరం లేకపోయినా మా వీధిలో తిరగడం
జాతరలో ఎవరు ఏ రంగు బట్టలేసుకోవాలో ముందే చెప్పుకోవడం
సహవాసగాళ్ళు నన్ను చూడగానే తనను ఆట పట్టించడం
గాజులు కొని ఇచ్చేవరకు దాచలేక ఇంట్లో దొరికి
తొందరలో చెల్లికోసం అనగానే ఆమె వచ్చి తీసుకోడం ....
.
ఇంకా ఇంకా చెప్పుకుంటూనే పోతే
ఆ పల్లెటూరిలో ప్రేమలు ఎప్పటికి మధురంగానే ఉంటాయ్
అవి విఫలం అయినా కూడా ... తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయ్
@Lakshmi

ఇది అది కాదు

నగ్నంగా కనిపించే నిజాన్ని చూడలేక
మీ సిద్ధాంతాల రంగుల బట్టల్ని కప్పి
మీ చూపుతో మీ మనసుకి మీరే అసత్యాన్ని చూపి
ఆ తప్పుని సమాజానికి ఆపాదిస్తూ
మీ కవి రాతల్నినిజమని నమ్మే
భవిష్యత్తుకు
నిజాన్ని వేశ్యగా చూపి
అబద్దాన్ని అమ్మలా చూపించండి
.
మీ బాటలో నడిచిన వాళ్ళు
నిజం తెలిసిన నాడు
మీరు అందంగా అలంకరించిన స్మశానంలో
మీ బంగారు సమాధుల్ని కడతారు
@Lakshmi

( మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )'

నేను నమ్మను
మీరు ఎన్ని చెప్పినా
ఎన్ని సార్లు చెప్పినా
ఎంత గింజుకుని చెప్పినా
నేను నమ్మను

ఈ ఒక్క రోజు
మీరు చూపించే గౌరవం చూసి
364 రోజులు చేస్తున్న
దౌర్జన్యాలను మరచి
పళ్ళికిలించడం నా వల్ల కాదు
.
సిద్దాంతాలను పేపర్లలో చూపి
చేతల్లో
మీ చెత్త బుద్దిని చూపిస్తున్న సాక్ష్యాలను
చూస్తూకూడా చూడనట్టుగా ఉంటూ
మీ మేకప్ బ్రతుకులకు
పౌడర్లు అద్దడం నాకు రాదు.
.
మీ మాటలకు చేతలకు
చప్పట్లు కొట్టే చింతామణులు
చెరువు గట్ల దగ్గర చేరి వుంటారు
వెళ్లి అక్కడ చెప్పుకోండి
మీ హృదయ పూర్వక
ఆరాధనలు , అభ్యుదయ భావాలు .
.
ఇక్కడొచ్చి
మీరెంత అరిచి గోల పెట్టినా
మీ ఉత్తుత్తి గౌరవాలను
నేను గౌరవించను
@Lakshmi

ఎవడు?

ఎవడు తిన్నాడు పచ్చడి మెతుకులు ?
ఎవడు తాగాడు ఇక్కడ గంజి ?
ఎవడిక్కడ వివక్షకు గురయింది ?
ఎవడి తరపున నిలబడి ఎవరిని ఎదిరిస్తున్నావ్ ?
ఎవరిపై కోపాన్ని ఎవరికి చూపిస్తున్నావ్ ?
ఎవరిని బలిచేసి ఎవరి ఆకలి తీర్చాలనుకుంటున్నావ్ ?
చివరికి ఎవరికి గర్భశోకం మిగులుతుంది ?
ఈ ప్రశ్నలకు తిరిగి ప్రశ్నలే వస్తాయి జవాబుగా ...
.
ప్రశ్నకు అసలైన జవాబు దొరకిన నాడు
పేదోడికి పెద్దోడికి మధ్య
మధ్యవర్తిలా వ్యవహరిస్తూ
పుల్లా పుల్లా చేర్చి
ఇన్నాళ్ళు మామద్యన మంటపెట్టిన
ముండా కొ__ కుల అస్థిపంజరాలతో
మేమందరం చలి కాసుకుంటాం
@Lakshmi

మాది పొనుగుపాడు

మాది పొనుగుపాడు
మళ్లీ చెప్తున్నా ... మావూరు పొనుగుపాడు ..
నేను పుట్టి పెరిగిన ఊరు
నాకు
కష్టాలు చూపించిన ఊరు
ఇష్టాలను పెంచిన ఊరు
కష్టపడి ఇష్టాన్ని దక్కించుకునే
కసిని నేర్పిన ఊరు
ఇక్కడే
నేను సెలయేటి నీళ్ళతో ఆడాను
గట్లు తెంచుకున్న వరదలో ఈదాను
ఇక్కడే
నేను వేప చెట్ల నీడలో సేద తీరాను .
ఎర్రటి ఎండలో కూలిపనులకు పోయాను
ఇక్కడే
నేను మధురమైన ప్రేమను పొందాను
కపట మనసుల మోసాలకు బలయ్యాను
ఇక్కడే
నేను నా మనసుని ఆస్వాదించాను
నా అంతరాత్మను అనుభూతి చెందాను
ఇక్కడే
నా అనుభవాలు అక్షరాలుగా మార్చగల
పరిజ్ఞానం పొందింది
ఇక్కడే
అక్షరజ్ఞానాన్ని అనుభూతులుగా మార్చుకోగల
పరిణితి చెందింది
.
.
మాది పొనుగుపాడు
మళ్లీ చెప్తున్నా ... మావూరు పొనుగుపాడు ..
.
బంధాల విలువలను
పాఠాలుగా నేర్పగలదు
గుణపాఠాలతోనూ నేర్పగలదు.
.
@Lakshmi

@PONUGUPADU

మనసున్న మనుషులు
మమతలతో కట్టుకున్న పొదరింటి
వాకిట్లో విరిసిన విరజాజుల వాసనలతో
తన మదిని నింపుకుంటున్న ఆ శివయ్య ఓ దిక్కున
.
ఉత్తరపు పొలాన అలసి వచ్చి
పచ్చగడ్డి తో వేసిన పానుపున
సేదదీరే కోడెదూడలను
చూస్తూ మురిసిపోతున్న శ్రీ రామచంద్రుడు మరో దిక్కున
.
అంతా నావాళ్ళే అనుకుంటూ
అన్నిటిని ఆలకిస్తూ
అరుగుమీదకూర్చోని వచ్చే పోయే వారిని
వివరాలు అడుగుతున్న ఆ పోతులురయ్య ఊరిమధ్యన
.
అన్నింటా అందరిని కాపాడుకొస్తూ
ఊరి పొలిమేరలను కాస్తున్న
ఆ అక్క చెల్లెళ్ళు పోలేరమ్మ అంకమ్మలు ఊరు చివరన
.
.
ఇన్నేళ్ళుగా కనిపించని అందాలు
ఈసారి కొత్తగా తోచాయి
నా ఊపిరి నా ఊరి పునాదులతో నిండిపోయింది
ప్రతిసారి పండగంటే రెండు రోజులు పనికి సెలవులాంటిది
కాని ఈసారి
తిరుగు ప్రయాణం లో
అమ్మ సర్దే అరిసెల పార్సిళ్ళ తో పాటు
మోయలేనంత బరువున్న
అనుబంధాల మధురానుభూతులుగా నాతో వచ్చాయి
@Lakshmi

ఓ రోజు వస్తా మీకోసం

ఎన్ని కన్నీళ్లు మింగానో ఆరోజు
బ్రతకాలనే దాహం తీర్చుకోడానికి
చేతిలో వున్నది ఒక్కసారిగా గొంతులో పోస్తే పనైపోతుంది
అంతవరకే తెలుసు అప్పటివరకు
ఇష్టంలేని కూరే కడుపులోకి దిగదు
అలాంటిది సంబంధం లేని దేదో నాలుకమీదపడగానే
ఒక్కసారిగా పేగులు ఏడవడం మొదలు పెట్టాయి నన్ను ఏం చెయ్యొద్దు అంటూ
రెండు చేతులతో నోటి నైతే కప్పి పెట్టాను కానీ
కడుపులోనుండి వస్తున్న వేడి ఆవిర్లు
వేరే మార్గాలను వెతుక్కునే ప్రక్రియలో
గొంతు దాటిన కీటకనాసిని కంపు
ముక్కుపుటల్లోంచి మళ్లీ బయటకు వస్తుంది
ఏడవాలనే ఉద్దేశం లేకపోయినా
కళ్ళు ఎర్రబడి
ఆ మంటల్లోంచి కాగిపోయిన నీరు కారిపోతోంది
ఏమి లేదు ఇంకో అయిదు నిముషాలు... అంటూ
నా చేయి నేనే పట్టుకొని ఒదార్చుకుంటుంటే
రెండు నిమిషాల్లో కనపడని గొంతు వినపడుతుంది
కానీ ఆమె చెప్పింది తప్పు అనడానికి ఆధారమైన నేను , నాకే కనిపించడం లేదు .
ఏమీ చెయ్యలేక ,
అబద్దాలకు భయపడి నిజాన్ని నిరూపించలేక
చేతకానిదానిలా , చెయ్యని తప్పును నాతోనే సమాధి చేసుకున్నా ..
ఆ సమాధి కట్టి రేపటికి ఆరేళ్ళు ...
కానీ నా ఆత్మ ఇంకో అరడజను గొయ్యిలు తవ్వి ఎదురుచూస్తుంది
వచ్చే జనభా లెక్కల్లో ఎవరి లెక్క తప్పబోతుందో మరి ....
@Lakshmi

Monday, May 2, 2016

ఎగురుతున్న ఎరుపు రంగు ఇది

ఏముంది ఆ ఇజంలో
పుడమి తల్లికి కడుపు కోత తప్ప
ఎరుపు రంగు ఏరులై పారడం తప్ప
.
నిజాన్ని మరచి ...
ఇజం ఇజం అంటూ గుండెలు బాదుకొంటూ
ఎరుపురంగు జాడలు విడుస్తున్న లేలేత అడుగులు
ఏ గమ్యాన్ని చేరాలనుకుంటున్నాయి
నీలో నువ్వు బ్రతికుంటే దాన్ని అడుగు
నీ గమనం , గమ్యం రెండూ ఒకవైపేనా అని ...
.
నిన్ను నువ్వు కాపాడుకోడానికి
ఈ ఎరుపుకండువాని ఎంచుకున్నట్టయితే
నీకు తెలియకుండానే అది నిన్ను కాల్చివేస్తుంది
నిఖార్సయిన మనుషుల నెత్తుటితో వెలిగిన సమిధ అది.
.
ఇంటికి ఎరుపురంగేసినంత మాత్రానా
నీ కళ్ళలో ఆ ఎరుపు కనపడదు
ఆకలి అన్నోడి గొంతు నులిమి
వాడి మాంసాన్ని పెంపుడు కుక్కలకు పెట్టె _ కొడుకుల
గుమ్మాలకు కాపలాగా మారిన
నీ నాయకత్వంతో విసుగెత్తిన ఈ చెమట చుక్కలు
ఏదో ఒకనాడు
తమ గుండెమంటలు చల్లార్చుకోడానికి
కల్తీ కలిసిన నీ నేత్తురిని వాడతాయి

@Lakshmi