Tuesday, January 5, 2016

బ్రతికున్న భావం

నేను భావోద్వేగాల శవాన్ని
భరించలేని భాధయినా
చెప్పలేనంత సంతోషం అయినా
నేను చలించకూడదంట
సమాజం లో చట్టాలు
అలా రాయబడ్డాయంట
ఈ చట్టాల్ని నేను పట్టించుకోక పోతే
అవి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాయంట .
సమాజంలో నుండి వెలివేస్తాయంట
మా గురువుగారు చెప్పారు
ఎంత ఆపినా
ఏదో ఒక అమావాస్యనాడు
నా ఆలోచనలు
నక్కల ఊళలో కలిసి
ఏడుస్తాయి
ఎంత ఆపినా
నా సంతోషం
ఏదో ఒక పౌర్ణమి లో
కలిసి చల్లని వెన్నెలలో నాట్యం చేస్తుంది
నా ఆలోచనల్లో ఎప్పుడో
ఈ సమాజం మరణించింది
నేనే దీన్ని ప్రతిసారి హత్య చేస్తున్నాను
నన్ను ఆపలనుకున్న ప్రతి సారి
నేను దీన్ని పొడిచి పొడిచి చంపాను
అయినా
నేను ఈ సమాజం ముందు
జుట్టు విరబోసుకున్న
ఆత్మ లాగానే కనిపిస్తున్నాను
నన్ను చంపలేక
తాను చచ్చిన సంగతి తెలియక
మూలాన కూర్చొని
మూలుగుతున్న ఈ సమాజాన్ని
నేనెప్పుడో వేలివేసాను
@Lakshmi

Monday, December 28, 2015

మాకెందుకు స్వాతంత్రం


స్వాతంత్రం పేరు చెప్పి
అడుగు బయట పెట్టగానే
అర లీటరు యాసిడ్ పోసేట్టయితే
మాకెందుకు స్వాతంత్రం
పెద్ద చదువు కోసం
ఊరు దాటగానే
వోణి పట్టి లాగేట్టయితే
మాకెందుకు స్వాతంత్రం
ఉద్యోగం కోసం పక్క ఊరికేల్తే
మానం పోగొట్టుకునేట్టయితే
మాకెందుకు స్వాతంత్రం
మనువు పేరు చెప్పి
మనసివ్వలేని వాడికి
తనువుని తాకట్టు పెట్టాల్సి వస్తే
మాకెందుకు స్వాతంత్రం
బాధ్యతల పేరు చెప్పి
బంధాల ముడులు వేసి
బంధీని చేస్తున్నపుడు
మాకెందుకు స్వాతంత్రం
పురిటిలోనే నాజాతిని
నరకయాతన పెట్టి
వీధి కుక్కల పాలు చేస్తున్నపుడు
మాకెందుకు స్వాతంత్రం
బానిసలుగా అలవాటుపడ్డ మాకు
స్వాతంత్రం పేరు చెప్పి
కొత్త ఆశలు పుట్టించి
సరికొత్త హింసలు
బహుమతిగా ఇచ్చేట్టయితే
మాకెందుకు స్వాతంత్రం

@Lakshmi

Tuesday, December 8, 2015

నా కోట్లకు పునాది నీ ఆకలేరోయ్



******************************
నాకెందుకు ఇదంతా
అయినా నీకు సేవ చేయాలనుంది
అందుకే
నీ గురించి పుస్తకం రాస్తా
ఒక్కో పుస్తకాన్ని 10 రూ/- అమ్ముతా
1000 పుస్తకాలకు 10000 వేలు వస్తాయి
వాటితో నీ గురించి షార్ట్ ఫిల్మ్ తీస్తా
దానితో లక్ష రూపాయలు వస్తాయి
వాటితో నీకోసం ట్రస్టు పెడతా
విరాళాలు కోట్లలో వస్తాయి
ఆ కోట్లలో ఒక లక్ష నీ పేరు చెప్పి
ప్రెస్ మీట్ పెట్టి
నీలాగే మావాడికి వేషం వేసి
దానం చేస్తాం
దాంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టేస్తా
నీ పేరు చెప్పిప్రభుత్వం నుండి వచ్చే
గుడి, బడి, తిండి, గుడ్డ అన్నీ
నా కడుపుకే..
రిజర్వేషన్ నీది రాచరికం నాది
నీపేరుతో నాకు పద్మశ్రీ లు
పద్మ భూషణ్ లు ..
హ హ నీకు మాత్రం
ఆ పూరి పాకనే...
నాకు కోపం వస్తే
ధర్నాలు, రాస్తారోకులు
నువ్ అడుక్కు తినడానికి కూడా
నా కనికరం వుండాల్సిందే ..
అయినా ఇదంతా నాకెందుకు
నా బ్రతుకు నాది
నీ బ్రతుకు నీది
కాని నా కోట్లకు పునాది మాత్రం నీ ఆకలేరోయ్ ...
.
@Lakshmi

పాత పలక



ఏడేళ్ళ వయసు అంటే
బడి, ఆటలు పాటలు, స్నేహితులు
ఇది అందరికి తెలిసింది...
కాని వాడిది దోవ వేరు,
పొద్దున్నే లేచి
అయ్యోరి పొలానికి గంధకం కొట్టి ,
గొడ్ల సావిడి శుభ్రం చేసి ,
అమ్మ కాసిచ్చే
ఆ కొద్ది గంజి కోసం
వాకిట్లో దొంతి కూర్చొని
ఉన్న ఒక్క చొక్కాకి బొత్తం
కుట్టుకుంటున్నాడు.
సూది చేతిలో గుచ్చుకుంటున్నా
వాడికి తెలియదు ,
వాడు ఈరోజు బడికి పోబోతున్నాడు
మొట్ట మొదటి సారి బడికి పోతున్నాడు
నిన్న రాత్రి నుండి కలలు కంటున్నాడు
అమ్మ గంజి కాసిచ్చే వరకు కుడా ఆగలేక
చొక్కా తొడుక్కుని
అయ్యోరి పిల్లాగాడి పాత పలక
శుబ్రంగా కడుక్కుని చంకలో పెట్టి ,
బడికి సిద్దమయ్యాడు ..
ఎండుకు పోయిన కడుపు
వాడికి దారికి అడ్డు రాదు.
చిరిగి పోయిన చొక్క
వాడి ధైర్యాన్ని దేబ్బతీయలేదు..
ఎగిరెగిరి పడే వాడి అడుగుని
గులక రాళ్ళు ఆపలేవు ..
ఒక్క బానిస బ్రతుకుకి
వాడి బాల్యాన్ని బలిచేసే
పెత్తందార్ల స్వార్ధం తప్ప ..
.
@Lakshmi


Wednesday, November 25, 2015

నాకు మనసుంది


నాలోని నన్ను చంపేసిన నిన్ను
మళ్లీ ఈరోజు చూసాను
నా సమాధిపై కూర్చొని
నీ రాకుమారికి పల్లకి సిద్దం చేస్తున్నావా ?
నీ పెళ్ళిలో వాడే ప్రతి పువ్వు
నా సమాధిపై పూచిందే అని మరువకు
నేను లేనని ఇక రానని బహుసా
నీ కన్నులు
వెలిగి పోతున్నాయేమో ...!
మరువకు
నాకు మనసుంది
కాబట్టే నన్ను చంపుకుని
నిన్ను వదిలేసాను
@Lakshmi

Tuesday, November 3, 2015

Save Water


రాబందులు
రెక్కలు విదులిస్తున్నాయి
గుంట నక్కలు
గొంతులను సరిచేసుకున్తున్నాయి
మనకెందుకులే అనుకున్న గుడ్లగూబలు
కళ్ళు మూసుకున్నాయి
కనిపించినంత మేర ఇసుక
తెరలు తెరలు గా లేచి ఆడుతుంది
నీళ్ళు లేక ఎండిన గడ్డి మొక్క
కన్నీళ్ళతో ప్రాణం పోసుకోవాలని ప్రయత్నిస్తుంది
పనికిరాని ప్లాస్టిక్ మొక్క యువరాజు ఇంటినెక్కి కూర్చుంది.
కనిపించి కనిపించని ఎండమావి రేపటి కోసం ఆశ కలిగిస్తుంది
కళ్ళలో నుండి జారుతున్న చినుకులు కంటి రెప్పలు కూడా దాటకుండా ఆవిరవుతున్నాయి
వచ్చిపోయే వాన మబ్బులు చుట్టపు చూపుతోనే సరిపెడుతున్నాయి.
నాన్న నాటిన వేప మొక్క ఇక జీవించలేనని ఎండుటాకులని ఇంటి ముందు రాల్చింది
ఎప్పుడు చూసినా పుడమి తల్లి దాహంతో దీనంగా చూస్తుంది.
ఇది చూసి
ఎరుపెక్కిన ఆకాశం ఏడ్చినా సరే ఏడుకోట్ల జీవరాసుల జీవితాలు నిలబడతాయి.
@Lakshmi

వేచివున్న తలపులు



నాకోసం వస్తావని ఆశించి నన్నొదిలి వెళ్తున్నా సంతోషంగా సాగనంపా
కలిసొచ్చే కాలం కోసం కళ్ళు మూయకుండా ఎదురుచుసా
మనసిచ్చినోడితో మనువుకోసం మనసార వేచి చూసా
మనవాడే కదా అని మది నిండా నింపుకున్నా
మాఘమాసం వచ్చేసరికి మంచి పట్టు చీర కోసం డబ్బులు దాచా
మరో ఘడియలో వస్తాడనగా తలపులతో నిండిన కళ్ళతో వాకిలిలో ఎదురుచూసా
కరుణించాడు ..... నన్ను కాదు మరో కాంతను
తన ఇల్లాలిగా కరుణించాడు
వేచివున్న తలపులు వాకిటి తలుపులలోనే వేలాడుతూ ఉరి వేసుకున్నాయి