Tuesday, July 5, 2016

ప్రియమైన అడాల్ఫ్ హిట్లర్ కి


అరేయ్...
.
నీతో ఫోన్ మాట్లాడకుండా వుండడం కష్టంగా వుంది
నిన్ను కలవకుండా వుండడం ఇంకా కష్టంగా వుంది
నీకోసం ఎదురుచూసి నువ్వొచ్చేసరికి నిద్రపోవడం బాధగా వుంది
అంత నిద్రలోను మాట్లాడాలని ట్రై చేసి మాట్లాడకుండా పడుకోవడం ఇంకా బాధగా వుంది
.
నీ ఫోటో పక్కలో పెట్టుకుంటే
దాని మీద
కాలేయ్యలేక పోతున్నా
చేయ్యేయ్యలేకపోతున్నా...
దాన్ని చూస్తూ పడుకోలేకపోతున్నా
చూడకుండా ఆపలేకపోతున్నా
.
నేను లేచినప్పుడు నువ్వు లేవవు
నువ్వు లేచేటప్పటికి నేనుండను.
పగటి పూట ఫోన్ కలవదు
రాత్రైతే ఫోన్ ఎత్తవు .
రోజంతా గడియారం బానే తిరుగుతుంది
రాత్రి పదకొండయితే మాత్రం
నిమిషాల ముళ్ళు నిదానంగా తిరుగుతుంది.
అదేందో మరి చేతబడి చేసిందానిలా ఫోన్ కల్లి అంతే చూస్తుంటా
నేను చెప్పిందంతా అర్ధం అయిందనుకుంటూ
అర్ధం కాకపోతే నా ఖర్మనుకుంటూ
.
ఇట్లు
కడుపునిండా తిని కన్నార్పకుండా చూస్తున్న
లక్ష్మి

Monday, July 4, 2016

రెండు జళ్ల సీతకు రోజులెక్కడివి ?

++++++++++++++++++++++

రావణుడెక్కడో లంకలో లేడు సీతా
పక్కింట్లోనో  లేక  ఎదురింట్లోనో
ఒక్కోసారి మనింట్లోనే ఉంటాడు

సీతా.. వాడు పది తలలతో పక పకా నవ్వుకుంటూరాడు
పలకరిస్తున్నట్టే పక్కనకూర్చుని
పళ్ళికిలిస్తాడు
గుర్తుపట్టేలోపు గొంతునులిమేస్తాడు 
తేరుకునేలోపు తగలెట్టేస్తాడు
.
నీ రాముడు నీ జీవితంలోకి రాకముందే
పురాణాల్లో ఉన్న రాక్షసులందరు
నీ ఇంటి కాలింగ్ బెల్ కొడతారు
.
ఇంకెందుకు సీతా ఆ ఎదురుచూపులు
ఈ చీకటి ప్రపంచంలో
వెలుగు నింపాలనుకునే మిణుగురులను
ఎప్పుడో వేయించుకుతిన్నారు

@Lakshmi



Thursday, June 30, 2016

ఈ జన్మకు .. ఇలా


+++++++++++
విరుల వానలో కురుల అందాలు
గంధపు చీరకు గులాబీ రేకులు
చీరంచున ఆడే సిరి మువ్వల రాగాలు
జతగాడి జాడకై పరుగిడిన పాదాలు
తమకాన్ని తమలోనే తమాయించుకున్న తడబాట్లు
కాలాల కౌగిట్లో కరిగిపోతున్న ఎడబాట్లు
వెన్నెల రాత్రుల్లో వసంత గీతాలు
మౌన పోరాటాల్లో మనసు ఆరాటాలు ..
కలల మాటున కలవరపాట్లు
మల్లెల మాటున మత్తెక్కిన సయ్యాటలు
ఈ జన్మకు ఇలానే ..
.
రేకుల అంచున వెన్నెల గీతికలు
తీగలనెక్కిన పూబాలల కిలకిలలు
కలువరేకు కళ్ళ కాటుక అందాలు
ఆ కాటుక మాటున దాగిన కన్నీళ్ల కవ్వింపులు
కరిగిపోతాను ఒరిగిపోతాను
ఈ జన్మకు ఇలానే
@Lakshmi


Monday, June 20, 2016

ఇంకెక్కడి ఏరువాక...


ఇంకెక్కడి ఏరువాక...
జోడెడ్ల ఉరుకులేవి ?
నాగళ్ల పరుగులేవి ?
ఆశగా ఎదురుచూసే
ఆసామి పెట్టె  ఉండ్రాళ్ళు ఏవి ?
.
ఇంకెక్కడి ఏరువాక...
తుప్పట్టిన నాగలి తుడిచేదెవరు?
తూరుపు కంటే ముందు లేచేదెవరు?
పడమట వరదగుడితో చుట్టరికం ఎవరికి?
పంటకాలవల గట్లతో చెలిమి ఎవరికి ?

ఇంకెక్కడి ఏరువాక...
వారసత్వం లేని వ్యవసాయం
ఫ్లాటులై పోతున్న పంటభూములు
మట్టి తన వాసన తానే పీల్చలేక
ఊపిరాడక వట్టిపోతున్న వైనాలు ..
.
మొక్కను మింగి
మోడును ఊసి
పసలేదంటూ
పనికిరాదంటూ
పచ్చని చేలని బంజరుగా మార్చి
పడక గదులు పేర్చారు .
.
ఆకాశం  ఏడిస్తే 
ఓదార్చి కన్నీళ్లను కడుపులో
నింపుకునే ధరణి
కనుమరుగై
కంకర రాళ్ళ కింద తొక్కబడి
ఛావలెక  ,చావురాక
జీవచ్చవంలా పడి వుంది
.
@Lakshmi

Thursday, June 16, 2016

సేవ్ గర్ల్ చైల్డ్ ( ఎవడి పాలాన పడెయ్యడానికో....?)


తానెల్ల తనువెల్ల కళ్ళై నపుడు 
నెనెల్ల నిలువెల్ల కన్నీరైనాను
 . 
తానెల్ల తనువెల్ల ముళ్లై గుచ్చినపుడు 
నెనెల్ల నిలువెల్ల రక్తమోడినాను 

తానెల్ల తనువెల్ల తడిమినపుడు 
నెనెల్ల నిలువెల్ల అగ్గినైనాను 

తానెల్ల తనువెల్ల కామగ్నితో నిండగా 
నెనెల్ల నిలువెల్ల తగలెట్టినాను 

అమ్మనై పుడితి తనకొరకు 
అక్కనై పుడితి తనకొరకు 
చెల్లినై పుడితి తనకొరకు 
కడకు ఆలి రూపమూ ఎత్తితి ... 
.
సహవాస దోషమా .. దురహంకార రూపమా 
ఆదిశక్తినే ధిక్కరించు మగజాతి మదమా .. 

ఎగిరెగిరి మీసాన్ని మెలితిప్పుతున్నావు 
బూడిదగురోజు బొమికలైనా మిగులునా...
@Lakshmi
 

Wednesday, May 11, 2016

నాకక్కర్లేదు


మాట్లాడని అక్షరాలు నాకక్కరలేదు
మరణించిన మనసులు అసలక్కర్లేదు
.
ముట్టుకున్నా వాసన తెలియని ఎరుపురంగులు
ఎంత ఎత్తున వున్నా విలువతెలియని రెపరెపలు
వెలిగించినా వెలుగునివ్వని వ్యవస్థలు
బయటకొచ్చి ప్రపంచాన్ని చూడలేని బెక బెకలు
నాకక్కర్లేదు
.
కళ్ళున్నా చూడడానికి ఇష్టపడని చూపులు
బ్రతికున్నా ఇంకొకరి బ్రతుకుకోరలేని జీవితాలు
చలనం లేక చంచలత్వం వచ్చిన రాతి శాసనాలు
కంచర గాడిదలకు కాపలా కాసే యునిఫారంలు
నాకక్కర్లేదు
.
నేనేంటో.. నాకు నేనేంటో ..
నా వరకే పరిమితమయ్యే ఈ సిద్దాంతాలేంటో
ఏదో రోజు నీ వరకు రావా ..
అప్పుడు కూడా నువ్విదే అంటావ్
"నాకక్కర్లేదు " అని
@Lakshmi

Tuesday, May 10, 2016

మరో " ఆత్మ " కథ

నిన్న నేను చంపిన హృదయం
స్మశానంలో సగం తగలబడి
అనాధ శవంలా అలానే ఉండిపోయింది .
మరో " ఆత్మ " కథ
అనంతం లో కలిసిపోతుంది
ఇన్నాళ్ళు చదివిన కథలు
కథలని తెలిసి కూడా
కన్నీళ్లు పెట్టిన నా హృదయాన్ని
కంటిలో చెమ్మ కుడా రాకుండా
కాల్చి పడేయాల్సి వచ్చింది ...
దాని కోసం అది కూడా
ఏడవలేకుండా కళ్ళు పీకి
నిర్దాక్ష్యణ్యంగా కొట్టి చంపా ...
నిన్న చంపిన నా హృదయం
రక్తపు మరకలు
ఈరోజు నా ఉతికిన చొక్కాకి
కొత్తగా అంటుకున్నాయి
తనకోసం కన్నీళ్లు కార్చలేక పోయా అని
నా దేహం తను ఖాళి చేసిన భాగాన్ని
రక్తంతో నింపింది ...
సమాజంలో బ్రతకడానికి
దాన్ని చంపాను
తనులేక ఉండలేక
నన్ను నేను చంపుకుంటున్నా
హత్యా లేక ఆత్మ హత్యా
లేక అంతరాత్మ హత్యా ?
కాదు కాదు
ఇది అంతరాత్మ చేసుకున్న
" ఆత్మ" హత్య
@Lakshmi