Thursday, June 30, 2016

ఈ జన్మకు .. ఇలా


+++++++++++
విరుల వానలో కురుల అందాలు
గంధపు చీరకు గులాబీ రేకులు
చీరంచున ఆడే సిరి మువ్వల రాగాలు
జతగాడి జాడకై పరుగిడిన పాదాలు
తమకాన్ని తమలోనే తమాయించుకున్న తడబాట్లు
కాలాల కౌగిట్లో కరిగిపోతున్న ఎడబాట్లు
వెన్నెల రాత్రుల్లో వసంత గీతాలు
మౌన పోరాటాల్లో మనసు ఆరాటాలు ..
కలల మాటున కలవరపాట్లు
మల్లెల మాటున మత్తెక్కిన సయ్యాటలు
ఈ జన్మకు ఇలానే ..
.
రేకుల అంచున వెన్నెల గీతికలు
తీగలనెక్కిన పూబాలల కిలకిలలు
కలువరేకు కళ్ళ కాటుక అందాలు
ఆ కాటుక మాటున దాగిన కన్నీళ్ల కవ్వింపులు
కరిగిపోతాను ఒరిగిపోతాను
ఈ జన్మకు ఇలానే
@Lakshmi


Monday, June 20, 2016

ఇంకెక్కడి ఏరువాక...


ఇంకెక్కడి ఏరువాక...
జోడెడ్ల ఉరుకులేవి ?
నాగళ్ల పరుగులేవి ?
ఆశగా ఎదురుచూసే
ఆసామి పెట్టె  ఉండ్రాళ్ళు ఏవి ?
.
ఇంకెక్కడి ఏరువాక...
తుప్పట్టిన నాగలి తుడిచేదెవరు?
తూరుపు కంటే ముందు లేచేదెవరు?
పడమట వరదగుడితో చుట్టరికం ఎవరికి?
పంటకాలవల గట్లతో చెలిమి ఎవరికి ?

ఇంకెక్కడి ఏరువాక...
వారసత్వం లేని వ్యవసాయం
ఫ్లాటులై పోతున్న పంటభూములు
మట్టి తన వాసన తానే పీల్చలేక
ఊపిరాడక వట్టిపోతున్న వైనాలు ..
.
మొక్కను మింగి
మోడును ఊసి
పసలేదంటూ
పనికిరాదంటూ
పచ్చని చేలని బంజరుగా మార్చి
పడక గదులు పేర్చారు .
.
ఆకాశం  ఏడిస్తే 
ఓదార్చి కన్నీళ్లను కడుపులో
నింపుకునే ధరణి
కనుమరుగై
కంకర రాళ్ళ కింద తొక్కబడి
ఛావలెక  ,చావురాక
జీవచ్చవంలా పడి వుంది
.
@Lakshmi

Thursday, June 16, 2016

సేవ్ గర్ల్ చైల్డ్ ( ఎవడి పాలాన పడెయ్యడానికో....?)


తానెల్ల తనువెల్ల కళ్ళై నపుడు 
నెనెల్ల నిలువెల్ల కన్నీరైనాను
 . 
తానెల్ల తనువెల్ల ముళ్లై గుచ్చినపుడు 
నెనెల్ల నిలువెల్ల రక్తమోడినాను 

తానెల్ల తనువెల్ల తడిమినపుడు 
నెనెల్ల నిలువెల్ల అగ్గినైనాను 

తానెల్ల తనువెల్ల కామగ్నితో నిండగా 
నెనెల్ల నిలువెల్ల తగలెట్టినాను 

అమ్మనై పుడితి తనకొరకు 
అక్కనై పుడితి తనకొరకు 
చెల్లినై పుడితి తనకొరకు 
కడకు ఆలి రూపమూ ఎత్తితి ... 
.
సహవాస దోషమా .. దురహంకార రూపమా 
ఆదిశక్తినే ధిక్కరించు మగజాతి మదమా .. 

ఎగిరెగిరి మీసాన్ని మెలితిప్పుతున్నావు 
బూడిదగురోజు బొమికలైనా మిగులునా...
@Lakshmi
 

Wednesday, May 11, 2016

నాకక్కర్లేదు


మాట్లాడని అక్షరాలు నాకక్కరలేదు
మరణించిన మనసులు అసలక్కర్లేదు
.
ముట్టుకున్నా వాసన తెలియని ఎరుపురంగులు
ఎంత ఎత్తున వున్నా విలువతెలియని రెపరెపలు
వెలిగించినా వెలుగునివ్వని వ్యవస్థలు
బయటకొచ్చి ప్రపంచాన్ని చూడలేని బెక బెకలు
నాకక్కర్లేదు
.
కళ్ళున్నా చూడడానికి ఇష్టపడని చూపులు
బ్రతికున్నా ఇంకొకరి బ్రతుకుకోరలేని జీవితాలు
చలనం లేక చంచలత్వం వచ్చిన రాతి శాసనాలు
కంచర గాడిదలకు కాపలా కాసే యునిఫారంలు
నాకక్కర్లేదు
.
నేనేంటో.. నాకు నేనేంటో ..
నా వరకే పరిమితమయ్యే ఈ సిద్దాంతాలేంటో
ఏదో రోజు నీ వరకు రావా ..
అప్పుడు కూడా నువ్విదే అంటావ్
"నాకక్కర్లేదు " అని
@Lakshmi

Tuesday, May 10, 2016

మరో " ఆత్మ " కథ

నిన్న నేను చంపిన హృదయం
స్మశానంలో సగం తగలబడి
అనాధ శవంలా అలానే ఉండిపోయింది .
మరో " ఆత్మ " కథ
అనంతం లో కలిసిపోతుంది
ఇన్నాళ్ళు చదివిన కథలు
కథలని తెలిసి కూడా
కన్నీళ్లు పెట్టిన నా హృదయాన్ని
కంటిలో చెమ్మ కుడా రాకుండా
కాల్చి పడేయాల్సి వచ్చింది ...
దాని కోసం అది కూడా
ఏడవలేకుండా కళ్ళు పీకి
నిర్దాక్ష్యణ్యంగా కొట్టి చంపా ...
నిన్న చంపిన నా హృదయం
రక్తపు మరకలు
ఈరోజు నా ఉతికిన చొక్కాకి
కొత్తగా అంటుకున్నాయి
తనకోసం కన్నీళ్లు కార్చలేక పోయా అని
నా దేహం తను ఖాళి చేసిన భాగాన్ని
రక్తంతో నింపింది ...
సమాజంలో బ్రతకడానికి
దాన్ని చంపాను
తనులేక ఉండలేక
నన్ను నేను చంపుకుంటున్నా
హత్యా లేక ఆత్మ హత్యా
లేక అంతరాత్మ హత్యా ?
కాదు కాదు
ఇది అంతరాత్మ చేసుకున్న
" ఆత్మ" హత్య
@Lakshmi

Just for Fun

అర్దరాత్రి ఆకలయి మెలకువ వచ్చింది
అనిపించిందే తడవుగా మహాబార్ బుక్ లోని వైట్ పేపర్ తీసా
నా ఇంటర్ లో మా ఫిబీ మేడం చెప్పిన
నాలుగు మంచిమాటలు పేపర్ పై రాసుకున్నా
కొంచెం స్పైసిగా వుండాలని
రెండు శ్రీ శ్రీ గారి లైన్లను దానికి కలిపా
మళ్లీ ఉప్పు తక్కువ అవుతదేమో అని
మా NSR గారి లైన్లు ఒక అయిదు కలిపా
పేపర్ ఫుల్ అయ్యింది
ఇంక తిందాం అని మడత పెట్టా
ఇంతలో మసాలా తక్కువ అవుతుందేమో
అని అనుమానం వచ్చి
నాకు ఇంగ్లీష్ నేర్పిన కమలిని ముఖర్జీ
అనగా మా B Tech ఇంగ్లీష్ లెక్చరర్ ...
ఆవిడ పలికిన నాలుగ ఇంగ్లీష్ పదాలు వేసా ..
వహ్... సూపర్ ..
తినబోతుండగా .....మధ్యలో
మా కెమిస్ట్రీ మాస్టర్ RK గారు చెప్పిన విషయం గుర్తొచ్చింది
" చదవని రోజున తినే హక్కు లేదని "
వెంటనే పేస్బుక్ ఓపెన్ చేసి రెండు పోస్ట్ లు చదివేసి
గబా గబా తినేసి పడుకున్నా
.
@Lakshmi

పల్లెటూరిలో ప్రేమ

అప్పుడు ఫోన్లు లేవు
ఒకే వూర్లో వుంటాం కాబట్టి ఉత్తారాలు అక్కర్లేదు
మాట చెప్పడానికి మధ్యవర్తులు లేరు
రేపు ఎప్పుడు కలవాలి అని చెప్పుకోలేదు
వూరి మధ్యలో వాళ్ళ ఇల్లు
వూరి చివర మా ఇల్లు
అయినా కలిసేవాళ్ళం
ఏకాంతం అనే మాట అసలే లేదు
కలిసి ఉన్నంత సేపు సిగ్గుతో మాటలు రావు
ఆ... ఊ.. అనుకునే లోపు ఎవరో ఒకరు వచ్చే వాళ్ళు
ఇష్టం అంతా కళ్ళతోనే మాటలన్నీ సైగలతోనే
అప్పుడప్పుడు గట్టు మీద నాకోసం పడేసే బంతి పువ్వు
పువ్వు పెట్టుకుని పొలానికెళ్తే పెళ్ళాన్నయిపోయినట్టే అని సంతోషం
దాహం అవ్వకపోయినా కాలువ దగ్గరకొచ్చి కలిసి పోవడం
వస్తానని చెప్పకపోయినా వచ్చేవరకు ఎదురుచూడ్డం
రాగానే సిగ్గుతో పారిపోవడం
నాకోసం విసిరిన రాళ్ళు పక్కన పని చేసే పిల్లకు తగలడం
కనపడకుండా చెట్టు చాటున కూర్చొని దాక్కోడం
సంబంధం లేకపోయినా నేను పనిచేసే పొలానికొచ్చి
అవసరం లేకపోయినా పొలం యజమానికి సాయం చేస్తున్నట్టు
నాకు సిగ్నల్స్ ఇవ్వడం
పని లేని రోజున నన్ను చూడ్డానికి స్నేహితుడినేసుకుని
అవసరం లేకపోయినా మా వీధిలో తిరగడం
జాతరలో ఎవరు ఏ రంగు బట్టలేసుకోవాలో ముందే చెప్పుకోవడం
సహవాసగాళ్ళు నన్ను చూడగానే తనను ఆట పట్టించడం
గాజులు కొని ఇచ్చేవరకు దాచలేక ఇంట్లో దొరికి
తొందరలో చెల్లికోసం అనగానే ఆమె వచ్చి తీసుకోడం ....
.
ఇంకా ఇంకా చెప్పుకుంటూనే పోతే
ఆ పల్లెటూరిలో ప్రేమలు ఎప్పటికి మధురంగానే ఉంటాయ్
అవి విఫలం అయినా కూడా ... తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయ్
@Lakshmi