Tuesday, October 20, 2015

నా అందమైన జ్ఞాపకం

నా అందమైన జ్ఞాపకం
**************************
ముందే చెప్పి వచ్చి వుంటే బాగుండేది
ఈ చీకట్లో ఈ వానలో నాకు ఈ బాధ తప్పేది
ఇప్పుడు చెప్దామంటే ఫోన్ సిగ్నల్స్ లేవు .
ఇంటికోస్తున్నానని చెప్పి వుంటే
నాన్నో తమ్ముడో  స్టేషన్ కి వచ్చేవాళ్ళు

నాకు చీకటంటే భయం లేదు
కాని వర్షం అంటే చాలా భయం
ఈ దిక్కుమాలిన ట్రైన్ 8 గంటలకు రావాల్సింది 11 గంటలకు వచ్చింది.
ఏం చేస్తాం 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఇప్పుడు.
అడుగులో అడుగేసుకుంటూ ఊరివైపు నడుస్తున్నా
వాన చిన్న చిన్న గా తగ్గుతూ తుంపర లా మారింది
ఇప్పటిదాకా వాన తాకిడితో హోరు గా వీచిన గాలి
చల్లగాలిలా మారి మగాణుల మీద నుండి నన్ను తాకుతుంది 
అన్నీ నేను తిరిగిన పొలాలే

ఒకప్పుడు
వరి నాట్లు కోసమో వరి కోతలకోసమో
తిరిగిన నేను
చాన్నాళ్ళ తరువాత ఈదోవలో నడుస్తున్నా
వెలుగు లేకపోయినా వరిపైరు వంపులు బాగానే కనపడుతున్నాయ్
దూరం నుంచి దాడోరి పొలం గట్టు మీద వున్న తాటి చెట్లు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు అక్కడే మా వాళ్ళకు వాళ్ళకు గొడవై చంపుకునే దాకా వచ్చింది
ఆ గొడవ కేవలం ఒక గుడ్లగూబ పిల్ల గురించి
ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది
మా బాబాయ్ పొలం రోడ్డు పక్కనే
బాగానే వుంది
కంకి పాలుపోసుకొనే దశలో వుంది
ఇంకో పదిరోజులకు కోత కొస్తుంది.
.
మా నానమ్మ చనిపోకముందు
ఈ రోడ్డు పక్క పొలమంతా మాదేనంట  మా నాన్న చెప్పేవాడు
కాలం కలిసి రాక ఇప్పుడు ఆ పొలాలన్నీ ఆసాముల పాలయ్యాయి
.
చూస్తుండగానే సగం దూరం నడిచేసా
ఇంకొంచెం నడిస్తే వూళ్ళో అడుగుపెట్టేస్తా
ఈ ఆలోచనల్లో పడి వర్షం పూర్తిగా ఆగిపోయిన సంగతి మర్చిపోయా .
.
సెల్ చేతిలో పట్టుకొని చిరంజీవి స్వయంకృషి సాంగ్స్ పెట్టుకున్నా
పురుగు పుట్ర వుంటే దూరంగా పోతాయన్న ఉద్దేశంతో
సిగ్గూ పూబంతి.. అంటూ పాట వస్తూ వుంది .
ఈ పాట నాకు పదవ తరగతి నుండి ఇష్టం
.
నేను పదవతరగతి అవ్వగానే చదువు మానేసాను
ఆ ఎండాకాలం లోనే కూలిపనికి పోవడం మొదలు పెట్టాను
దుక్కి దున్నడానికి వచ్చిన బాలు ట్రాక్టర్ లో ఈ పాట వినపడింది
.
తెలియకుండానే పాటకు అనుగుణంగా మనసు పలికింది .
మనసుకు అనుగుణంగానే మనిషి కలిసాడు
మనిషికి అనుగుణంగానే అడుగు కదిలింది
అడుగు అడుగు కలిసి ఐదేళ్ళు నడిచింది
ఆరవ పడిలోకి అడుగుపెట్టే నాటికి
అయినవాళ్ళు కులాల మూలాలు వెతికారు
అడుగులు తడబడి దారులు వేరై నేటికి మూడేళ్ళు
అన్ని బాగుంటే అందరిలా నేను పిల్లా పాపలతో ఊర్లోనే వుండేదాన్ని
.
ఎవరిగమ్యం ఎంతవరకో ముందే నిర్ణయించబడింది
వెల్లువలా పొంగే ఆలోచనలు పాటతో పాటే ఆగిపోయాయి
అప్పట్లో అది నా మనోవేదన అయివుండొచ్చు
కాని ఇప్పుడది నా అందమైన జ్ఞాపకం
.
ఇలా ఇంకెన్నాళ్ళు ఒంటరి ప్రయాణం చెయ్యాలో ..
.
@Lakshmi

No comments:

Post a Comment