Friday, October 30, 2015

బలవంతపు చావులు


నేను ఓ సామాన్య మైన కుటుంబం లో కూతురి స్థానం లో వున్నా
మాది మధ్యతరగతికి దిగువన వున్న కుటుంబం
ఇది ఎందుకు చెబుతున్నానంటే ...
మమ్మల్ని వుద్దరిద్దామని కొంత మంది బాగా ఆవేశ పడుతున్నారు
ఇది ఎంత వరకు నిజం ?
.
కొంత మంది వాళ్ళ ఆవేశాన్ని కవితల రూపంలో కధనాల రూపం లో చూపిస్తారు
ఈ పుస్తకాలు మా వరకు చేరవు ఎందుకంటే
అలాంటి పుస్తకాలు కొనిక్కుని చదివే తీరిక డబ్బులు మాకు వుండవు.
మా పిల్లల స్కూల్ పుస్తకాలకే మాకు డబ్బులు చాలవు.
.
ఇంకొంత మంది సినిమాల రూపంలో లేదా షార్ట్ ఫిల్మ్స్ రూపం లో చూపిస్తారు
ఇవి కూడా మాకు చేరవు ఎందుకంటే
మేముండేది పల్లెటూర్లలో లేకపోతే పట్నపు డంప్ యార్డుల దగ్గరలో
అలాంటప్పుడు మాకు సినిమాలు చూడడం అంటే అర్ధం
ఒకరోజు కూలిడబ్బులు కోల్పోవడం మరియు రేపటికోసం దాచిన డబ్బులు ఖర్చు చేయడం
కడుపు నింపుకోవడం కోసం దాచిన డబ్బుల్ని మేం వృధా చెయ్యలేం
.
ఇంకొంత మంది మాకోసమే వాళ్ళ జీవితాలు ధారపోస్తారంట ఎలా అంటే ..
మేము మాకున్న ఒక్కగానొక్క వోటు వేసి వాళ్ళను గెలిపిస్తే
మా జీవితాలు మారుస్తారంట
సరే ఒప్పుకుని ఓటు దేముంది వేసేస్తాం గెలిచేస్తారు , ఇంత వరకు బాగుంది
మళ్లీ అయ్యగారు మాకు కనబడేది అయిదేళ్ళ తరువాత అదికూడా జనాబా లెక్కల్లో మేముంటే
.
ఇంకొంత మంది వున్నారు
మాలోంచి పుట్టుకొచ్చి మాలాంటి వాళ్ళ కోసం పోరాడుతున్నాం అని చెప్పే వాళ్ళు
మా కులానికి అన్యాయం జరిగింది మా కులానికి అది జరిగింది ఇది జరిగింది అని
వేరే కులపోళ్ళతో గొడవలు పెడతారు
ఈడికి ఎక్కడ కాలినా కులం పేరు చెప్పి అందర్నీ ముంచుతాడు
అంటే వీడి సొంత అభిప్రాయాన్ని కులం పేరుతో ఆ సామాజిక వర్గం మొత్తానికి రుద్దుతాడు
వీడి వల్ల మాకు మంచి దేవుడెరుగు .. చెడే ఎక్కువ
ఎలా అంటే ?
వీడు ఎదుటి వాడి ఇగోని రెచ్చగొట్టి వదులుతాడు కులం పేరుతో
రెక్కల కష్టం మీద బ్రతికే మాకు పని దొరకదు
కొడుకు చదువు కోసం , కూతురు పెళ్లి కోసం అప్పు పుట్టదు
లంచాలిచ్చి లోన్ తెచ్చుకున్నా తీర్చాలంటే అమ్మడానికి ఆస్తులుండవ్
మా అమ్మాయిలు ఒంటరిగా పనికోసం , చదువుకోసం పంపితే తిరిగి వాళ్ళను
మానాలతో ప్రాణాలతో చూడలేం .
.
ఇవన్నీ నేను నిజజీవితంలో చూసినవి
మీరు నిజంగా ఏమన్నా చెయ్యాలంటే
మీరు రాసిన కవితల్ని కధనాలని పాంప్లేట్స్ గా పంచండి
లేక పల్లెటూర్లలో గోడ ప్రతుల్ని అంటించండి
మీరు తీసే సామజిక దృక్పధం వున్న సినిమాల్ని
సాయంత్రం వేళ స్కూల్ గ్రౌండ్స్ లో తెరలు ఏర్పాటు చేసి చూపించండి
లేని వాడికి కావాల్సింది మూడు పూటలా అన్నం
ఎవడు పని చేసినా దానికే
వాడికి తినే అన్నం లో కులం కనపడదు మతం కనపడదు
అందువలన మీరు చేసే కులాల మతాల గొడవల వల్ల
ఇలాంటి వాళ్ళు ఎంత మేలు పొందుతున్నారో ఆలోచించండి
అంతే కాని
మీరు చేసే రోడ్ షో లో మాకు తెలియవు
మీరు చేసే బంద్ లు మాకు అర్ధం కాదు
.
నాకు తెలిసి 100 మందిని కలుపుకొని 1000 మందికోసం పోరాడే కంటే
10 మందికి పనికొచ్చే పని చేస్తే కనీసం కొంత వరకైనా బలవంతపు చావులు తగ్గుతాయి
బలవంతపు చావులంటే బ్రతుకుమీద విరక్తి చెందిన చావులు కాదు
బ్రతకాలని వున్నా బ్రతుకు పోరాటంలో వోడిపోయి గాల్లో కలిసే ఆకలి చావులు



@Lakshmi

No comments:

Post a Comment