Wednesday, January 25, 2017

అలల తాలూకు అక్షరాలు


ఏమీ తీసుకోనంటూనే
జ్ఞాపకాల బరువుని తీసేసుకుంది
పలకరించనంటూనే పరిచయాన్ని పెంచుకుంది 
భయపెడుతూనే అక్కున చేర్చుకొని సంతోషాన్ని పంచింది
పీడకలలా మెలకువ తెచ్చి మధ్య రాత్రి వెన్నెలను చూపింది
వెన్నెల రాత్రి రాగాలను బంధించి గుప్పెట్లో పెట్టింది
రంగు వెలిసిన మల్లెలకు వాసనను అద్దింది
చీకటికి రంగులేసిన రాయుడిని రాత్రికి రాజుని చేసి
నన్ను రాణిగా రమ్మని పిలిచింది
కలగా దాచుకున్న క్షణాలను
క్షణంలో అనుభవాలుగా మార్చి సారెగా పెట్టింది
మళ్ళీ రమ్మంటూ మనసునిండా తన జ్ఞాపకాలను నింపింది
ఎరుపెక్కిన తూరుపుని
కుంకుమ బొట్టుగా దిద్ది
ఇంటి ఆడబిడ్డగా సాగనంపింది.
@Lakshmi

Monday, January 23, 2017

సముద్రపు కన్నీళ్లు

++++++++++++++
కళ్ళకు తెలియని చూపులు
వేళ్ళకు తెలియని రాతలు 
పెదవికి తెలియని పిలుపులు
పుట్టుకేలేని ప్రేమకి విరహదాహాలు
ఎదురుకాని మనిషికోసం
ఏళ్లతరబడి ఎదురుచూపులు
కన్నీళ్లు లేవు కలహాలు లేవు ..
చివరికి కౌగిలింతలూ లేవు 
ప్రణయపు ప్రయాణాలకు
పలకరింపులే గాని గమ్యాలు లేవు
.
ఊరి పొలిమేర్లవరకు వెళ్లొచ్చే చూపులు
ఎన్ని వేల సార్లు ఓడిపోయాయో 
ఈ తొలిచూపుకు నోచుకోని ఎదురుచూపులకు
ఏ పైరగాలి ప్రశ్న జవాబుగా మారుతుందో
ఏ అలలో చిక్కిన కల నిజమవుతుందో...
.
ఇన్నాళ్లు కనపడని కన్నీళ్ల ఆనవాళ్లు
నిన్న నన్ను తడిపి ఏడ్చేసాయి
ఓదార్పు ఇవ్వలేని నేను
నేనే సంద్రాన్నై ఆ కలల అలలను మింగేసాను
@Lakshmi

Wednesday, November 16, 2016

కన్నీళ్లకు కన్నీళ్లు

ఎన్నిసార్లు అలిగినా గడపదాటనివ్వని స్వార్థం నాది
వాటి ఉనికిని కూడా ప్రపంచానికి చూపించడం ఇష్టం లేక
నా చేతులతోనే వాటిని వాకిట్లోనే చిదిమేసే క్రూరత్వం నాది
.
అంత కష్టపడి.. పుట్టిన ప్రతిసారి కడతేరుస్తున్నా ...
ఏమరపాటుగా ఉన్నప్పుడు
గోడదూకి పారిపోయే ప్రయత్నంలో
నా చేతికి చిక్కి గుప్పిట్లో నలిగిపోతాయి
ఎవరన్నా చూస్తారేమో అని తలుపులు మూసుకుని
తలపులని తరుముతున్నా....
మరపుకు రానివ్వను .. మెలకువ రానివ్వను
ఆగలేక తొంగిచూసిన మరుక్షణంలోనే
పైటకొంగుకి ఉరితీయబడతాయి
.
@Lakshmi

అచ్చం నాలానే ....


++++++++++++++++++
వెలుగుకు భయపడే నిజాలు కూడా ఉన్నాయి
అచ్చం నాలాగే ...
వెలుగును మాత్రమే చూడాలనుకున్నంత కాలం
అవి తెరవెనుక నీడలనే తేలిపోయినట్లుంటాయి
కాలంతో పరిగెత్తేప్పుడు ఆ నీడలే నీతోడు ..
.
అలసిన నాడు ఆదరింపు కోసం
ఏనాడైనా వెనక్కి చూస్తే
ముందు వరసలో ఉండేది ఆ నిజాలే
అచ్చం నాలాగే ...
.
వెలుగుకోసం అంత ఇష్టం పెంచుకున్న నువ్వు
చీకటిలో ఉండే ఆ నిజాలను నమ్మడానికి
ఒక్కోసారి రోజులు నెలలే కాదు సంవత్సరాలే పట్టొచ్చు
అంత మాత్రాన ఆ నిజాలు చీకట్లో కలిసిపోవు
అచ్చం నాలానే ....
@Lakshmi

Friday, August 19, 2016

నిశాని

++++++++++
రెండు అక్షరం ముక్కలు రాగానే రచయిత అవ్వడు
నలుగురు వెనక రాగానే నాయకుడు అవ్వడు
అది సల సల కాగే రక్తం లో ఉంటుంది
నీకు నువ్వుగా పూసుకునే ఎర్రరంగుని చూసి 
రక్తపు మరకలని నువ్వే పొరబడుతున్నావు
బి పి లు పెంచుకోవడం తప్ప
నీ పెన్ను లోని సిరా ఎప్పటికి ఎరుపురంగు నింపుకోదు
తొలిపొద్దులో నువ్వు నాకు కనపడాలంటే
పడమర ఎరుపెక్కేవరకు నువ్ పోరాడాల్సిందే
అక్కడ ఇక్కడ నీడలెతుక్కునే పనిలో ఉన్ననీకు
యుద్ధం ఎక్కడ ఎలా మొదలవుతుందో ఎలా తెలుసు
రాళ్లను చేతుల్తో పగలగొట్టాలనే కసి రావాలంటే
ఆ రాళ్ళ దెబ్బ నీకు ఎప్పుడో తగిలుండాలి
ఇల్లంతా అత్తరు వాసనతో నింపుకున్న నీకు
రక్తం కక్కే అక్షర సత్యాలు అర్ధం కావు
అందుకే నిన్నంటాను నేను "నిశానీ " అని .
.
ఇప్పుడయినా  చదువుకో
కాలం కొన్ని పాఠాలు మన బ్రతుకు పుస్తకం లో రాస్తుంటుంది
నువ్వు వాటిని  చదవలేనపుడు నిరక్షరాశ్యం నిండిపోతుంది
నీకు నువ్వే చమురు లేని దీపంలా
చీకటి మగ్గిపోయి చరిత్రలో నీకంటూ పేజీ లేకుండా పోతుంది
ఇప్పటికైనా తలరాత మార్చుకొని
మాట్లాడే అక్షరాలతో సావాసం మొదలుపెట్టు .
@Lakshmi

Tuesday, July 5, 2016

ప్రియమైన అడాల్ఫ్ హిట్లర్ కి


అరేయ్...
.
నీతో ఫోన్ మాట్లాడకుండా వుండడం కష్టంగా వుంది
నిన్ను కలవకుండా వుండడం ఇంకా కష్టంగా వుంది
నీకోసం ఎదురుచూసి నువ్వొచ్చేసరికి నిద్రపోవడం బాధగా వుంది
అంత నిద్రలోను మాట్లాడాలని ట్రై చేసి మాట్లాడకుండా పడుకోవడం ఇంకా బాధగా వుంది
.
నీ ఫోటో పక్కలో పెట్టుకుంటే
దాని మీద
కాలేయ్యలేక పోతున్నా
చేయ్యేయ్యలేకపోతున్నా...
దాన్ని చూస్తూ పడుకోలేకపోతున్నా
చూడకుండా ఆపలేకపోతున్నా
.
నేను లేచినప్పుడు నువ్వు లేవవు
నువ్వు లేచేటప్పటికి నేనుండను.
పగటి పూట ఫోన్ కలవదు
రాత్రైతే ఫోన్ ఎత్తవు .
రోజంతా గడియారం బానే తిరుగుతుంది
రాత్రి పదకొండయితే మాత్రం
నిమిషాల ముళ్ళు నిదానంగా తిరుగుతుంది.
అదేందో మరి చేతబడి చేసిందానిలా ఫోన్ కల్లి అంతే చూస్తుంటా
నేను చెప్పిందంతా అర్ధం అయిందనుకుంటూ
అర్ధం కాకపోతే నా ఖర్మనుకుంటూ
.
ఇట్లు
కడుపునిండా తిని కన్నార్పకుండా చూస్తున్న
లక్ష్మి

Monday, July 4, 2016

రెండు జళ్ల సీతకు రోజులెక్కడివి ?

++++++++++++++++++++++

రావణుడెక్కడో లంకలో లేడు సీతా
పక్కింట్లోనో  లేక  ఎదురింట్లోనో
ఒక్కోసారి మనింట్లోనే ఉంటాడు

సీతా.. వాడు పది తలలతో పక పకా నవ్వుకుంటూరాడు
పలకరిస్తున్నట్టే పక్కనకూర్చుని
పళ్ళికిలిస్తాడు
గుర్తుపట్టేలోపు గొంతునులిమేస్తాడు 
తేరుకునేలోపు తగలెట్టేస్తాడు
.
నీ రాముడు నీ జీవితంలోకి రాకముందే
పురాణాల్లో ఉన్న రాక్షసులందరు
నీ ఇంటి కాలింగ్ బెల్ కొడతారు
.
ఇంకెందుకు సీతా ఆ ఎదురుచూపులు
ఈ చీకటి ప్రపంచంలో
వెలుగు నింపాలనుకునే మిణుగురులను
ఎప్పుడో వేయించుకుతిన్నారు

@Lakshmi